newsseals.com
DEVOTIONAL

టీటీడీకి రూ.1.20 కోట్లు విలువైన బ్లేడ్లు విరాళం

VijayaBhaskar December 18, 2025
newsseals-TTDDonaation
Spread the love

ప్ర‌శంస‌లు కురిపించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు

తిరుమల : హైదరాబాద్ కు చెందిన వర్టీస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ శ్రీధర్ బోడుపల్లి టీటీడీకి ఏడాదికి సరిపడా రూ.1.20 కోట్లు విలువైన సిల్వర్ మాక్స్ హాఫ్ బ్లేడ్లలను విరాళంగా అందించారు.
ఈ మేరకు దాత తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో చైర్మన్ బీ.ఆర్.నాయుడుకు బ్లేడ్లను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ భక్తులు తలనీలాలు సమర్పించేందుకు బ్లేడ్ల కోసం టీటీడీ ఏడాదికి రూ.1.16 కోట్లు ఖర్చు చేస్తోందన్నారు. రోజుకు 40 వేల హాఫ్ బ్లేడ్లను కల్యాణకట్టల్లో వినియోగిస్తున్నామని తెలిపారు. ఒక ఏడాదికి టీటీడీకి సరిపడా బ్లేడ్లను విరాళం ఇచ్చేందుకు ముందుకు రావడం గొప్ప విషయమని దాతను చైర్మన్ అభినందించారు.

ఈ సందర్భంగా దాత శ్రీధర్ బోడుపల్లి మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా హాఫ్ బ్లేడ్లను అందుబాటులోకి తీసుకువచ్చిన సంస్థ తమదేనని అన్నారు. ఈ హాఫ్ బ్లేడ్ల వల్ల కల్యాణకట్టలో భక్తులకు తలనీలాలు తీసేందుకు క్షురకులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. తమ సంస్థ తయారు చేసిన బ్లేడ్లకు యూరప్, అమెరికాతో సహా 52 దేశాల్లో మంచి డిమాండ్ ఉందన్నారు. 7′ఓ క్లాక్ సంస్థ బ్లేడ్లను కూడా తామే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కల్యాణకట్ట ఏఈఓ రమాకాంత్ పాల్గొన్నారు.