newsseals.com
DEVOTIONAL

25న తిరుచానూరు ప‌ద్మావ‌తి ఆలయంలో రథసప్తమి

VijayaBhaskar January 5, 2026
newsseals-RathaSapthami
Spread the love

20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ వాహనంపై విహ‌రించి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్నారు. మధ్యాహ్నం 1 నుండి 2 గంటల వరకు చిన్నశేష వాహనం, సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు చంద్రప్రభ వాహనం, రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు గజ వాహనంపై ద‌ర్శ‌న‌మిస్తారు.

కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామి వారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, కుంకుమార్చ‌న‌, బ్రేక్ ద‌ర్శ‌నం, ఊంజ‌ల‌ సేవ, వేదాశీర్వచనంలను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కనే ఉన్న శ్రీ సూర్య నారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వ వాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని 20వ తేదీ ఆలయంలో ఉదయం 6.30 గం.ల నుండి 9.00 గం.ల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. అనంతరం సర్వదర్శనం భక్తులు శ్రీ పద్మావతీ అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవం సేవను రద్దు చేశారు.