newsseals.com
News

కొబ్బ‌రి చెట్ల రైతుల‌కు రూ. 10 కోట్ల ప‌రిహారం

VijayaBhaskar February 18, 2026
newsseals-Athannaiud
Spread the love

ప్ర‌క‌టించిన కింజార‌పు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో న‌ష్ట పోయిన కొబ్బ‌రి చెట్ల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లిస్తామ‌ని ప్ర‌క‌టించారు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. సర్వే పూర్తి చేసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లి బ్యాంకుల సహకారంతో సమగ్ర చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. కొబ్బరి తోటల నష్టంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, నిపుణుల బృందంతో పరిశీలించినట్లు తెలిపారు. రైతులకు తగిన న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. మల్కీపురం, మామిడికుదురు మండలాల పరిధిలోని కేసనపల్లి, శంకరగుప్తం తదితర గ్రామాల్లో పెద్దఎత్తున కొబ్బరి చెట్లు ఎండిపోయినట్లు నివేదికలు అందాయని పేర్కొన్నారు. దాదాపు ఒక లక్ష కొబ్బరి చెట్లు పాడైపోయిన నేపథ్యంలో, ప్రతి చెట్టుకు రూ.1,000 చొప్పున మొత్తం రూ.10 కోట్లు ఆర్థిక సహాయం అందించేందుకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు సమర్పించిందని చెప్పారు.

ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ ఆమోదం కోసం పంపినట్లు వెల్లడించారు. దీర్ఘకాలిక పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం “శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునీకరణ” పనులకు రూ.20.77 కోట్లు మంజూరు చేసిందని, ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అదనంగా, కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా ఆర్ఆర్ పథకం కింద హెక్టారుకు రూ.32,500లు, అలాగే పాత మొక్కలు తొలగించడానికి కొత్త మొక్కలు వేయడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నామని పేర్కొన్నారు. విబి-జి-రామ్-జి (ఉపాధి హామీపథకం) పథకం ద్వారా, ఉద్యానవన (కొబ్బరి) తోటలు పథకంలో బాగంగా పాతవి తొలగించి కొత్తవి నాటటం కోసం, ఎకరాకు గరిష్టంగా రూ.99,181 వరకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు ప్ర‌క‌టించారు.