newsseals.com
DEVOTIONAL

ఒంటిమిట్ట బ్ర‌హ్మోత్స‌వాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి

VijayaBhaskar February 19, 2026
newsseals-Ontimitta
Spread the love

ఏప్రిల్ 1న శ్రీ సీతారాముల క‌ల్యాణం : టిటిడి జేఈవో వీర‌బ్ర‌హ్మం

తిరుప‌తి జిల్లా : ఒంటిమిట్టలో వార్షిక బ్ర‌హ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా ఏర్పాట్ల‌ను గురువారం ప‌రిశీలించారు టీటీడీ జేఈవో వి. వీర‌బ్రహ్మం. కీల‌క సూచ‌న‌లు చేశారు. ప్ర‌ధాన ఆలయం నుండి కల్యాణ వేదిక వరకు రోడ్డు ఇరువైపుల మొక్కలు పెంచాలని అన్నారు. కళ్యాణ వేదిక వద్ద విఐపిలు బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలన్నారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసే తాత్కాలిక వంటశాల స్థలాన్ని పరిశీలించి ప‌లు సూచ‌న‌లు చేశారు.

అనంత‌రం జేఈవో అధికారుల‌తో స‌మీక్ష చేప‌ట్టారు. భక్తులకు సౌకర్యవంతంగా క్యూలైన్లు, వసతి షెల్టర్లు, సూచిక బోర్డులు, తాగునీటి సౌకర్యం, తదితర ఇంజనీరింగ్ పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. రథం తిరిగే వీధులను, ముఖ్యంగా మాడ వీధుల్లో మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా కటౌట్లు, విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు ఏర్పాటు చేయాలన్నారు వీర‌బ్ర‌హ్మం.

బ్రహ్మోత్సవాల విజయవంతానికి అన్ని విభాగాల సిబ్బందిని డిప్యూటేషన్ పై నియమించాలన్నారు. భ‌క్తుల‌కు ఎలాంటి అసౌక‌ర్యాం క‌లుగ‌కుండా ప్రధమ చికిత్స కేంద్రాలు, నిపుణులైన వైద్య సిబ్బంది, మందులు, అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాల‌న్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టం ద్వారా నిరంతరాయంగా శ్రీరామనామం ప్రసారం చేయాలన్నారు. బ్రహ్మోత్సవాలకు ముందు 10 రోజులపాటు ప్రచార ర‌థాల‌ ద్వారా పరిసర గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని, బ్ర‌హ్మోత్స‌వాల కరపత్రాలు పంపిణీ చేయాలన్నారు.