newsseals.com
BUSSINESS

క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల కల్ప‌న

VijayaBhaskar March 31, 2026
newssealss-AmaravathiQuantomVally
Spread the love

కార్యాచ‌ర‌ణ సిద్దం చేయాల‌ని సీఎం ఆదేశం

అమరావతి : అమ‌రావ‌తి లోని క్వాంటం వ్యాలీలో మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌కు సంబంధించి త‌క్ష‌ణ‌మే కార్యాచ‌ర‌ణ రూపొందించాల‌ని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగ‌ళ‌వారం
సచివాలయంలో అమరావతి క్వాంటం వ్యాలీ- క్వాంటం హార్డ్‌వేర్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌పై రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. నేషనల్ క్వాంటం మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, స్టేట్ క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, ఐబీఎం డైరెక్టర్ అమిత్ సింఘీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సీడాక్, సీడాట్, డీఆర్డీఓ, బార్క్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు క్వాంటం కంప్యూటర్ పరికరాల తయారీ కంపెనీలు, క్రయోజనిక్స్, ఫోటోనిక్స్, పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులు హాజ‌ర‌య్యారు.

త్వరలో సిద్ధం కానున్న అమరావతి క్వాంటం వ్యాలీలో క్వాంటం కంప్యూటింగ్ పరికరాల తయారీ, ఇతర హార్డ్ వేర్, అల్గారిథమ్స్ సహా వివిధ అంశాలపై రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులో చర్చ జ‌రిగింది. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 5 గ్లోబల్ క్వాంటం హబ్స్ లో ఒకటిగా ఏపీని తీర్చిదిద్దేలా కార్యాచరణ చేపట్టాలని రౌండ్ టేబుల్ లో నిర్ణయం తీసుకున్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు హార్డ్ వేర్ ఎకోసిస్టం ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాల‌న్నారు. బయోఫౌండ్రీ సహా వివిధ స్టార్టప్ ల సహకారంతో డిజైన్లు, ఆవిష్కరణలు, పరిశోధన చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. మేడ్ ఇన్ అమరావతి విధానంతో క్వాంటం కంప్యూటర్ పరికరాల ఉత్పత్తికి విస్తృత ప్రయత్నాలు చేయాలని సూచించారు సీఎం.