బీఆర్ఎస్ ఆరోప‌ణ‌లు అబ‌ద్దం : కోహినూర్ గ్రూప్

VijayaBhaskar · April 6, 2026
Spread the love

నాద‌ర్ గుల్ భూములు ప్ర‌భుత్వానివి కావు

హైద‌రాబాద్ : నాద‌ర్ గుల్ భూములు క‌బ్జాకు గురైన‌ట్లు మాజీ మంత్రి హ‌రీశ్ రావు చేసిన ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ భూమి అసలు రాజా శివ్ రాజ్ బహదూర్‌కు చెందిన ప్రైవేట్ ఆస్తి అని పేర్కొంది. ఈ విష‌యాన్ని 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పుతో ఆయన వారసులే హక్కుదారులని ధ్రువీకరించ బడింది. అసలు ఈ భూమిపై వివాదం 2005లో OS నెంబర్ 155తో ప్రారంభమైందని తెలిపింది. యాజమాన్యం , ఆక్యుపెన్సీ హక్కులపై డిక్లరేషన్, రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని నిలువరించాలని కోరుతూ పిటిషనర్లు కోర్టును ఆశ్రయించారని వెల్ల‌డించింది. అయితే 30 ఏప్రిల్ 2007న ట్రయల్ కోర్టు ఈ కేసును కొట్టివేసిందని , దీనిపై హైకోర్టులో AS నంబర్ 274/2007 ద్వారా అప్పీల్ దాఖలైందని, డివిజన్ బెంచ్‌లో భిన్నాభిప్రాయాల కారణంగా కేసు మూడో న్యాయమూర్తికి వెళ్లిందని స్ప‌ష్టం చేసింది.

19 డిసెంబర్ 2011న వెలువడిన తీర్పులో పిటిషనర్లను పూర్తి యజమానులుగా కోర్టు గుర్తించిందని తెలిపింది కోహినూర్ గ్రూప్. రాష్ట్రం జోక్యం చేసుకోకుండా శాశ్వత ఇంజంక్షన్ కూడా మంజూరు చేసిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం/APIIC 2013లో దాఖలు చేసిన సివిల్ అప్పీలు (2963, 2964)ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. సదరు భూయజమానులకు ఆక్యుపెన్సీ హక్కులు వర్తించేలా ఉత్తర్వులిచ్చింది. భూమి విస్తీర్ణం అధికంగా ఉండటంతో ల్యాండ్ రిఫార్మ్స్ చట్టం వర్తించాలనే ప్రశ్న తలెత్తినప్పుడు,2015 వరకు భూమి వివాదంలో ఉండటంతో ఆ చట్టం అమలు కాదని స్ప‌ష్టం చేసింది.

2016లో దాఖలైన రివ్యూ పిటిషన్ కూడా తిరస్కరించబడింది. 2021లో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని రాష్ట్రాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ భూమికి సంబంధించిన డెవలప్‌మెంట్ ఒప్పందం AQ స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వద్ద ప్రస్తుతం ఉందని తెలిపింది. రాజా శివ్ రాజ్ బహదూర్ వారసుల ప్రతినిధి కరీం అల్లాదీన్‌తో AQ స్క్వేర్ రియల్టర్స్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని స్ప‌ష్టం చేసింది. అదేవిధంగా ఒమేగా డెవలప్‌మెంట్ వెంచర్స్, ఆల్ఫా ఎస్టేట్ హోల్డింగ్స్, యునైటెడ్ ల్యాండ్‌మార్క్స్ సంస్థలతో కూడా ఒప్పందాలు ఉన్నాయని వెల్ల‌డించింది.