నీటిని నిల్వ చేయాలి జ‌లాశ‌యాలు నింపాలి

VijayaBhaskar · April 6, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అనంత‌పురం జిల్లా : స‌మ‌స్త మాన‌వాళికి నీరు అత్యంత ముఖ్య‌మ‌ని, దానిని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. సోమ‌వారం అనంత‌పురం జిల్లా తాడప‌త్రిలో ఆయ‌న ప్ర‌సంగించారు. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి. జలాశయాలు నింపేందుకు ప్రయత్నించాలని అన్నారు. ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్ లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం అన్నారు. పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాల్లో వేశామ‌న్నారు. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్ లు, నీరు చెట్టు, నీరు మీరు, నీరు ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టిన‌ట్లు తెలిపారు.

నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించు కుంటున్నాం అన్నారు సీఎం. అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్లపాటు నీరే లేదన్నారు. నష్ట పోతున్న రైతులను ఆదుకోడానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనేన‌ని గుర్తు చేశారు చంద్ర‌బాబు నాయుడు. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకు వచ్చామ‌న్నారు. 90 శాతం మేర సబ్సిడీ తో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో మేమేన‌ని పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్ పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చిందన్నారు.