newsseals.com
News

జనగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలి : సీఎం

Posted by: VijayaBhaskar April 16, 2026
newsseals-APCM

స్వీయ జనగణనలో చంద్ర‌బాబు వివ‌రాలు న‌మోదు

అమరావతి : రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రారంభమైన స్వీయ జనగణన కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ ద్వారా వివరాల నమోదు ప్రక్రియ ఇవాళ ప్రారంభమైంది. se.census.gov.in వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రి వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియను ఏపీ జనగణన డైరెక్టర్ జె.నివాస్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్ లైన్ లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని తెలిపారు. మే 1 తేదీ నుంచి 30 తేదీ వరకూ ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని తెలియ చేశారు.

దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో పౌరులందరికీ సమానంగా సంక్షేమం అభివృద్ధి ఫలాలు అందించాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. దీని కోసం కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికల్ని రూపోందించటం అవసరమని ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలో జనగణన కార్యక్రమం జరుగుతోందని ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరుగనుందని మొదటి దశలో ఇవాల్టి నుంచే ఇండ్ల గణన ప్రారంభమైందన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే రెండో దశలో జనాభా లెక్కల సేకరణ మొదలవుతుందన్నారు. ప్రస్తుతం ప్రారంభమైన ఇండ్ల గణన( హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని దీనిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు.