చంద్ర‌బాబు భ‌జ‌న చేసిన బ‌క్క‌ని న‌ర‌సింహులు

VijayaBhaskar · May 28, 2026
Spread the love

తెలంగాణ అనే ప‌దం డిక్ష‌న‌రీలో లేద‌ని కామెంట్

మంగ‌ళ‌గిరి : తెలుగుదేశం పార్టీ మ‌హానాడు వేదిక‌గా తెలంగాణ ప్రాంతానికి చెందిన షాద్ న‌గ‌ర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు బ‌క్క‌ని న‌ర‌సింహులు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడినంత సేపు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును పొగ‌టానికే స‌రి పోయింది. ఇక తాను ఏం చేస్తున్నాన‌నే విష‌యం చెప్ప‌లేక పోయారు. అంతే కాదు అస్తిత్వానికి, పోరాటాల‌కు పురిటి గ‌డ్డ అయిన తెలంగాణ గురించి అవాకులు పేలారు. తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదన్నారు కొంతమంది స్వార్థపరులు ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చి కష్టపడే వాళ్ల జీవితాలలో మ‌న్ను పోశారంటూ వాపోయారు.

తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను నందమూరి తారక రామారావు రద్దు చేశాకే నిజమైన స్వాతంత్ర్యం వచ్చింద‌న్నారు.భారతదేశంలోనే గొప్ప ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొనియాడారు. ప్రజల సంక్షేమ కోసం అన్ని వసతులను ప్రజల గుమ్మం దగ్గరకే తీసుకొచ్చారన్నారు .చదువుల పండుగ అనే పథకం ద్వారా అందరికీ నాణ్యమైన విద్యనందించిన ఘనత చంద్రబాబుది అనిపేర్కొన్నారు. తాత, తండ్రి అడుగుజాడల్లో యువ నాయకుడు లోకేష్ చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయ‌న్నారు.