newsseals.com
News

సాగు కోసం నాణ్య‌మైన విత్త‌నాల స‌ర‌ఫ‌రా

VijayaBhaskar June 3, 2026
newsseals-APSeeds
Spread the love

మంత్రి అచ్చెన్నాయుడు వెల్ల‌డి

అమ‌రావ‌తి : వ్య‌వ‌సాయ రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు త‌మ స‌ర్కార్ కృషి చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజార‌పు అచ్చెన్నాయుడు. సాగుకు సంబంధించి రైతుల‌కు మెరుగైన‌, నాణ్య‌వంత‌మైన విత్త‌నాల‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ట్లు తెలిపారు. కృష్ణా, గుంటూరు, అన్నమయ్య, వైఎస్సార్ కడప, ఏలూరు, బాపట్ల, విజయనగరం, శ్రీకాకుళం తదితర జిల్లాల్లో ఈ కార్యక్రమం ద్వారా వేలాది మంది రైతులు ఇప్పటికే లబ్ధి పొందినట్లు మంత్రి వెల్లడించారు. రైతుల అవసరాలకు అనుగుణంగా విత్తనాల సరఫరాను మరింత పెంచి పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామ‌న్నారు.

వ్యవసాయాన్ని కేవలం జీవనాధార రంగంగా కాకుండా ఆదాయాన్ని పెంచే రంగంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. నాణ్యమైన విత్తనాల పంపిణీ, సబ్సిడీ పథకాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, నీటి వనరుల సమర్థ నిర్వహణ, భూసార పరిరక్షణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. భూమి ఆరోగ్యంగా ఉంటే రైతు అభివృద్ధి చెందుతాడు.. రైతు అభివృద్ధి చెందితే రాష్ట్రం పురోగమిస్తుంది అనే సంకల్పంతో పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తోందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.