ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేయాలి

VijayaBhaskar · June 6, 2026
Spread the love

నిప్పులు చెరిగిన బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ

న్యూఢిల్లీ : న‌రేంద్ర మోదీ సార‌థ్యంలోని ఎన్డీఏ కేంద్ర ప్ర‌భుత్వంపై నిప్పులు చెరిగారు బొద్దింక‌ల జ‌న‌తా పార్టీ (సీజేపీ). నీట్ , సీబీఎస్ఈ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌డం లో విఫ‌లం అయ్యింద‌ని ఆరోపించారు. శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీ వేదిక‌గా సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే సార‌థ్యంలో వేలాది మంది గుమి గూడారు. తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం చేశారు. వీరి ఆందోళ‌న‌కు ప‌లు పార్టీల‌తో పాటు భావ సారూప్య‌త క‌లిగిన వ్య‌క్తులు, ప్ర‌ముఖులు మ‌ద్ద‌తు ప‌లికారు. ఎన్సీపీ శ‌ర‌ద్ ప‌వార్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే శ‌ర‌త్ ప‌వార్ సైతం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో మోదీ పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించాల్సిన ప‌రీక్ష‌ల‌ను కావాల‌ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర‌కు తెర లేపార‌ని ఆరోపించారు.

అందుకే యువ‌తీ యువ‌కుల ఆగ్ర‌హానికి కేంద్రం గురి కావాల్సి వ‌చ్చింద‌న్నారు. ఇదిలా ఉండ‌గా భారీ ఎత్తున చేరుకున్న యువ‌త తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ప్ర‌ధానంగా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డంలో ఘోరంగా విఫ‌లం అయ్యారంటూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ పై మండిప‌డ్డారు. బేష‌ర‌తుగా క్ష‌మాప‌ణ దేశ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని, దీని వెనుక బీజేపీకి చెందిన వారు కీల‌క పాత్ర పోషించార‌ని ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే ఆయా ప‌రీక్ష‌ల లీకుల‌కు బాధ్య‌త వ‌హిస్తూ ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకోవాల‌ని, ఆయ‌న నిర్వాకంపై విచార‌ణ జ‌రిపించాల‌ని సీజేపీ డిమాండ్ చేసింది.