హైద‌రాబాద్ లో యూనివ‌ర్శిటీ ఆఫ్ లండ‌న్ క్యాంపస్

VijayaBhaskar · June 12, 2026
Spread the love

ఇది త‌మ విజ‌యం అన్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్య‌మంత్రి ఎ రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన నీతి ఆయోగ్ 11వ కీల‌క స‌మావేశంలో పాల్గొన్నారు. ఈసంద‌ర్బంగా త‌మ సార‌థ్యంలో రాష్ట్రంలో తీసుకున్న సంచ‌ల‌న నిర్ణ‌యాల గురించి ప్రస్తావించారు. విద్య‌, వైద్యం పై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు సీఎం. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలను తెలంగాణకు తీసుకు రావడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ దిశగా యూనివర్సిటీ ఆఫ్ లండన్ హైదరాబాద్‌లో ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటు చే యడం తొలి విజయమని వివ‌రించారు. దేశ ఆర్థికాభివృద్ధికి ప్రధాన ఇంజిన్లుగా ఉన్న ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాల అభివృద్ధి కోసం ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో ‘ఎం-6 టాస్క్‌ఫోర్స్’ ఏర్పాటు చేయాలని సీఎం ప్రతిపాదించారు.

ఈ నగరాల అభివృద్ధి కోసం రూ.6 లక్షల కోట్ల ప్రత్యేక నిధిని కేటాయించాలని కోరారు సీఎం. ఒక్కో నగరానికి రూ.1 లక్ష కోటి చొప్పున మౌలిక వసతుల అభివృద్ధికి అందించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ సీఎం పలు ప్రతిపాదనలు చేశారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, భారత్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అనుమతులు, సెమీ కండక్టర్ పరిశ్రమల ఏర్పాటుకు మద్దతు, హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు వంటి అంశాల్లో సహకారం అందించాలని కోరారు. దేశ ప్రజల ఆరోగ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి పెడితే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా భారత్ అవతరిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.