శ్రీవారిని దర్శించుకున్న నారా లోకేష్

ఘన స్వాగతం పలికిన అడిషనల్ ఈవో చౌదరి
తిరుమల : రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ గురువారం తిరుమల లోని కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ముందుగా వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి ప్రవేశించిన మంత్రి లోకేష్ కు మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో పాటు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం మంత్రి లోకేష్ తిరుప్పావడ సేవలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.
రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, పులివర్తి నాని, గాలి భానుప్రకాష్, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మీ, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ఛైర్మన్ సుగుణమ్మ, తుడా ఛైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి లోకేష్ మీడియాతో మాట్లాడారు. గతంలో జగన్ రెడ్డి సర్కార్ పట్టంచు కోలేదని కానీ కూటమి సర్కార్ వచ్చాక పెద్ద ఎత్తున తిరుమలలో భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. తిరుమలకు వేలాది మంది నిత్యం వస్తుంటారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.