newsseals.com
News

జగన్ అబద్ధాలకు అంబాసిడర్ : అచ్చెన్నాయుడు

VijayaBhaskar July 3, 2026
newsseals-Atchannaidu

అమరావతి : ఈ-పంట నమోదుపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సాక్షి పత్రిక చేస్తున్న అసత్య ప్రచారం పూర్తిగా నిరాధారమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. అబద్ధాలకు అంబాసిడర్ జగన్ అయితే, వాటికి వేదిక సాక్షి పత్రిక అని ఆయన విమర్శించారు. ప్రజలకు నిజాలు చెప్పాల్సిన పత్రిక, వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం అత్యంత దురదృష్ట కరమన్నారు. కానీ సాక్షి రాసే అసత్యాలను ప్రజలు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని స్పష్టం చేశారు.

శుక్ర‌వారం మంత్రి అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు. పంట నమోదుపై జగన్ చేస్తున్న ఆరోపణలను గణాంకాలే తిప్పి కొడుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఖరీఫ్-2024లో కేవలం 41.87 లక్షల మంది రైతుల 96.78 లక్షల ఎకరాలు మాత్రమే నమోదు కాగా, కూటమి ప్రభుత్వం ఖరీఫ్-2025లో 53.32 లక్షల మంది రైతుల 117.39 లక్షల ఎకరాలు నమోదు చేసి గణనీయమైన పురోగతి సాధించిందన్నారు. అలాగే ల్యాండ్ పార్సిల్స్ నమోదు 106.38 లక్షల నుంచి 198.93 లక్షలకు పెరిగిందని, రబీ 2025-26లో 99.7 శాతం ఈ-పంట నమోదు పూర్తి చేశామని తెలిపారు. ఖరీఫ్-2026లో APAIMS 2.0ద్వారా అత్యాధునిక సాంకేతికతతో డిజిటల్ పంట నమోదు చేపడుతున్నామని మంత్రి తెలిపారు. జియో-రెఫరెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఉపగ్రహ సాంకేతికత, మూడు దశల ఎస్ ఎమ్ ఎస్ సమాచారం, రైతులు స్వయంగా నమోదు చేసుకునే సౌకర్యం, గ్రీవెన్స్ వ్యవస్థ వంటి అనేక పారదర్శక విధానాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు.