ప్రశ్నించడాన్ని ఎవరూ చంపలేరు : రావణ్
అమరావతి : ప్రశ్నించడం అన్నది ప్రజాస్వామ్యానికి మూలం, ముఖ్యం కూడా. ప్రభుత్వాన్ని ప్రత్యేకించి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున గొంతు వినిపిస్తూ వస్తున్నారు యూట్యూబర్ రావణ్. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ఏకి పారేస్తూ వచ్చారు. రావణ్ ఏకంగా ప్రశ్న పేరుతో సామాజిక వేదికగా యూట్యూబ్ ఛానల్ ను ప్రారంభించాడు. అది కొద్ది కాలంలోనే సంచలనంగా మారింది. ఇదే సమయంలో తనపై అక్రమ కేసులు బనాయించారు పలు చోట్ల. రావణ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన కేవీఆర్ అలియాస్ వెంకట్రామి రెడ్డిని అందరూ చూస్తూ ఉండగానే ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసుల పర్మిషన్ తీసుకోకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారు.
తను నారా లోకేష్ పదే పదే మాట్లాడే రెడ్ బుక్ రాజ్యాంగం గురించి ప్రశ్నించాడు. నిలదీశాడు. దీనిని తట్టుకోలేక కక్ష కట్టారు. తనను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పడుతూ తెలంగాణ సమాజం, ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనపై ఇబ్బందులు ఇలాగే కొనసాగిస్తే తెలంగాణ మరో ఉద్యమం చేపట్టేందుకు రెడీగా ఉందంటూ హెచ్చరించారు సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి. ఈ తరుణంలో తనను అరెస్ట్ చేసిన సందర్బంగా ప్రశ్న ఛానల్ వ్యవస్థాపకుడు , సీనియర్ జర్నలిస్టు రావణ్ నిప్పులు చెరిగాడు. తనను చంపగలరేమో కానీ ప్రశ్నను ప్రపంచంలో ఎవరూ చంపలేరని నొక్కి చెప్పారు. తాజాగా రావణ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.