రూ.34 కోట్లతో దేవాలయాల అభివృద్ధి
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. టీటీడీ నిధులతో రూ.34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. నియోజకవర్గమంతా మొబైల్ కనెక్టివిటీ కల్పిస్తామని, తిరుమల తర్వాత అత్యధిక గ్రీన్ కవర్ ఉన్న ప్రాంతం కుప్పమేనని, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్నారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో సీటీ స్కాన్, డయాలసిస్ సదుపాయాలు విస్తరించామని, ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
కుప్పానికి వస్తున్న పరిశ్రమల్లో మంచి ఉద్యోగాలు పొందాలంటే యువత నైపుణ్య శిక్షణపై దృష్టి పెట్టాలని సూచించారు. స్కిల్ డెవలప్మెంట్ విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని అధికారులను ఆదేశించారు.
గత ప్రభుత్వం ప్రజల భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించిన చంద్రబాబు… వివాదాస్పద భూములను పరిష్కరిస్తున్నామని, శెట్టిపల్లి, వట్టిచెరుకూరు భూముల సమస్యలకు పరిష్కారం చూపామని తెలిపారు. తిరుమలలో గత పాలకమండలి కల్తీ నెయ్యి వినియోగించి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిందని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం దాన్ని అరికట్టిందని పేర్కొన్నారు. కుప్పంపై గత ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించిందని ఆరోపించారు. నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగులు వేసి డ్రామాలు ఆడిందని విమర్శించారు. 2019-24 మధ్య తనను కుప్పంలో పర్యటించ నీయకుండా అడ్డుకున్నారని, తనకు సహకరించిన స్థానికులను వేధించారని ఆరోపించారు.