తిరుమలలో 450 దేశీయ గోవులకు ఆరోగ్య పరీక్షలు
తిరుమల : గో సంరక్షణశాలలో గోవులకు గర్భకోశ సంబంధిత వ్యాధులు, శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ, నివారణ తదితర ఆధునిక వైద్యసేవలు అందిస్తున్నారు. ఇప్పటి వరకు 450 దేశీయ గోవులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా, అందులో 250 గోవుల్లో గర్భధారణకు అవకాశం ఉన్నట్లు గుర్తించారు. వాటికి అవసరమైన దాణా, వైద్యం, శస్త్రచికిత్సలు, పోషకాహారం, రోజువారీ సంరక్షణపై గోశాల సిబ్బందికి నిపుణులు ప్రత్యేక సూచనలు అందిస్తున్నారు.
గోవుల్లో యోని సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వాటికి ప్రత్యేక వైద్యసేవలు అందించారు. ఒక గోవుకు పేడ వెలువడే మార్గం, ప్రసవ మార్గం రెండూ ఒకటిగా ఉండటంతో అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి రెండు మార్గాలను వేర్వేరుగా రూపొందించారు. మరో గోవు నడవలేని పరిస్థితిలో ఉండటంతో కాలికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలాంటి క్లిష్టమైన చికిత్సలను నిపుణులైన పశువైద్యులు అత్యంత నైపుణ్యంతో నిర్వహిస్తున్నారని జేఈవో శరత్ తెలిపారు.
ఏపీ స్టేట్ వెటర్నరీ కౌన్సిల్ ఛైర్మన్ డా. పి.వి. లక్ష్మయ్య ఎస్వీ గోసంరక్షణశాలను సందర్శించి గోవులకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డా. లక్ష్మయ్యను టీటీడీ అధికారులు శాలువాతో సత్కరించారు. అలాగే గోసేవలో పాల్గొంటున్న నిపుణ వైద్యులను ఘనంగా సన్మానించారు. వైద్యులకు టీటీడీ కల్పిస్తున్న వసతి, భోజనం, ఇతర సౌకర్యాలపై ఆరా తీయగా, వారు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు.