ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : భరత్
అమెరికా : న్యూయార్క్‌లో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్‌కు రావాలని ఆహ్వానించారు ఏపీ రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖా మంత్రి టీజీ భరత్. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలలుపునిచ్చారు. అంతే కాకుండా పారిశ్రామిక వృద్ధికి తోడ్పడాలని ఎస్సార్ క్యాపిటల్ (Essar Capital) నాయకత్వాన్ని మంత్రి భరత్ కోరారు. ప్రస్తుతం అధికారిక పర్యటన నిమిత్తం న్యూయార్క్‌లో ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్, రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించాల్సిందిగా ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆహ్వానించారు. వారికి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. తన పర్యటనలో భాగంగా, మంత్రి ఎస్సార్ క్యాపిటల్ ప్రెసిడెంట్ ,, సీఈఓ మధు వప్పులూరిని కలిసి, ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ రంగాలలో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు.
రాష్ట్రం ఒక కీలకమైన పెట్టుబడి గమ్యస్థానంగా ఎదుగుతోందని చెప్పారు టీజీ భరత్. భారతదేశానికి వస్తున్న పెట్టుబడులలో దాదాపు 25 శాతం ఆంధ్రప్రదేశ్ వైపు ఆకర్షితం అవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని , పారిశ్రామిక వృద్ధికి తోడ్పడాలని ఎస్సార్ క్యాపిటల్ నాయకత్వాన్ని భరత్ కోరారు. అనంతరం, మంత్రి ‘సదరన్ రూట్స్’ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక ‘పీకాన్ నట్’ (pecan nut) షెల్లింగ్ , ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ఆ సంస్థ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఆయన తెలిపారు. ఈ రంగంపై ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధను పునరుద్ఘాటిస్తూ, దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలిపేందుకు నిరంతర కృషి జరుగుతోందని భరత్ చెప్పారు.