newsseals.com
News

ఏఎన్ఎం పోస్టుల మెరిట్ లిస్టు విడుద‌ల‌

Posted by: VijayaBhaskar July 11, 2026
newsseals-MHSRB

హైద‌రాబాద్ : తెలంగాణ వైద్య విజ్ఞాన ప‌రిష‌త్ , ఆరోగ్య శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ANM) పోస్టుల తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేశారు. మొత్తం 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ (ఫిమేల్) పోస్టుల భర్తీకి సంబంధించి తొలి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (MHSRB) విడుదల చేసింది. మే 14న అభ్యర్థులు పరీక్షలో పొందిన మార్కులు, కాంట్రాక్ట్/అవుట్‌సోర్సింగ్ సేవలకు సంబంధించిన వెయిటేజ్ మార్కులతో కూడిన ప్రొవిజనల్ జాబితాను విడుదల చేసి, మే 18 నుంచి మే 22, 2026 వరకు అభ్యంతరాలను స్వీకరించారు.

ఈ‌ అభ్యంతరాలను పరిశీలించి, పరిష్కరించిన బోర్డు తొలి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌ను విడుదల చేసింది.
నియామకాల్లో పారదర్శకత కోసం మరోసారి అభ్యంతరాలు స్వీకరించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌పై అభ్యంతరాలు ఉంటే జూలై 13 నుంచి జూలై 15వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు MHSRB వెబ్‌సైట్‌లో తమ లాగిన్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. అభ్యంతరాలు ఒక్కసారి మాత్రమే నమోదు చేసే అవకాశం ఉండటంతో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. లేక‌పోతే ఇబ్బందులు ఎదుర్కొనే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది.