పిల్లలకు సంస్కారం నేర్పించాలి : వంగలపూడి అనిత
విజయవాడ : హోంమంత్రిగా తన భద్రత కోసం తుపాకులు ఉన్నప్పటికీ, సమాజాన్ని మార్చే అసలైన శక్తి కలానిదేనని మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. “కత్తి కన్నా కలం గొప్పది… గన్ కన్నా పుస్తకం గొప్పది. తుపాకి భయాన్ని సృష్టిస్తుంది… పుస్తకం వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది” అని అన్నారు. చిన్నతనంలో తన తండ్రి పుస్తకాలు చదివే అలవాటు పెంచారని, అదే తన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని గుర్తు చేసుకున్నారు. యువత పుస్తక పఠనాన్ని జీవనశైలిగా మలుచు కోవాలని పిలుపునిచ్చారు .మహిళలపై జరుగుతున్న వేధింపులు, సోషల్ మీడియాలో పెరుగుతున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు మాత్రమే కాదు… అబ్బాయిలకు కూడా మహిళలను గౌరవించడం, సంస్కారవంతంగా ప్రవర్తించడం, బాధ్యతతో వ్యవహరించడం నేర్పించే ప్రత్యేక ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
“నేడు సోషల్ మీడియాలో తల్లి ఎదుట కూడా మాట్లాడలేని భాషను, భార్యతో కూడా ఉపయోగించలేని భాషను, సోదరి లేదా కుమార్తె ఎదుట పలకలేని పదాలను కొందరు ఉపయోగిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వికృత సంస్కృతికి సమాజంలో స్థానం ఉండకూడదు” అని అన్నారు. మహిళలను కించపరిచే వారిపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. అదే సమయంలో పుస్తక పఠనం, విలువలతో కూడిన విద్య సమాజాన్ని మరింత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. “నేడు మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు… ప్రపంచ స్థాయి విజయాలు సాధిస్తున్నారు. కానీ వారికి దక్కాల్సిన గౌరవం మాత్రం ఇంకా పూర్తిస్థాయిలో లభించడం లేదు. ఆ పరిస్థితి మారాలి. మహిళలను గౌరవించే సమాజమే నిజమైన నాగరిక సమాజం” అని మంత్రి అన్నారు . మహిళా రిజర్వేషన్ అమలుపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేసిన మంత్రి, మహిళల రాజకీయ సాధికారతకు తమ కూటమి ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. తెలుగు భాషను కాపాడేది కేవలం ప్రభుత్వాలు మాత్రమే కాదని… ప్రతి కుటుంబం, ప్రతి ఉపాధ్యాయుడు, ప్రతి రచయిత, ప్రతి విద్యార్థి అని పేర్కొన్నారు.