newsseals.com

వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

July 12, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన స్తాయిలో ఆడ‌లేదు. మ‌రో వైపు ఈసారి ఐపీఎల్ సీజ‌న్ లో అద్భుతంగా ఆడి అంద‌రి మ‌న్న‌న‌లు పొందిన 15 ఏళ్ల బీహార్ కుర్రాడు వైభ‌వ్ సూర్య వంశీని సంజూ శాంస‌న్ ను త‌ప్పించి ఆడించారు. కానీ త‌ను కూడా తేలి పోయాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లోకి ఎందుకు ఎంట్రీ ఇచ్చారో ఆ సెలెక్ష‌న్ క‌మిటీకే తెలియాల‌ని అన్నాడు హ‌ర్ష భోగ్లే.

ఒక కుర్రాడిని అంతర్జాతీయ క్రికెట్‌లోకి వేగంగా తీసుకువచ్చి, సమస్య మొదలవ్వగానే పక్కన పెట్టలేరంటూ పేర్కొన్నాడు. భోగ్లే ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు. ఈ ఎంపిక వెనుక ఉన్న బృహత్ వ్యూహాన్ని అర్థం చేసుకోవడానికి నేను నిజంగా ఇబ్బంది పడుతున్నాను. వైభవ్ సూర్యవంశీని చూడండి—ఆ కుర్రాడి వయసు కేవలం 15 ఏళ్ళే! అతను ఐపీఎల్‌లో 776 పరుగులతో అదరగొట్టాడు, కానీ ఇంగ్లాండ్‌లో అంతర్జాతీయ క్రికెట్ పూర్తిగా భిన్నమైనది. అవును, అతను షార్ట్ బాల్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడ్డాడు. మూడు మ్యాచ్ లు క‌లిపి 42 ర‌న్స్ మాత్ర‌మే చేశాడు.

కానీ అతను కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలబడే ధైర్యం మీకు లేకపోతే, అసలు అతన్ని సీనియర్ జట్టులోకి ఎందుకు వేగంగా తీసుకు వచ్చారంటూ ప్ర‌శ్నించాడు హ‌ర్ష భోగ్లే. కేవలం మూడు మ్యాచ్‌ల తర్వాత అతన్ని తొలగించడం చాలా గందరగోళ సంకేతాన్ని ఇస్తుంద‌న్నాడు. జోఫ్రా ఆర్చర్ వంటి ప్రపంచ స్థాయి పేసింగ్ బౌలర్లకు ఒక తరం ప్రతిభావంతుడిని పరిచయం చేసి, ఆ తర్వాత జట్టులో సమస్య మొదలవ్వగానే అతన్ని పక్కన పెట్ట‌డం భావ్యం కాద‌న్నాడు.

Related News