కులం, మతం అనేవి ఉద్యమానికి అతీతమైనవి

చెన్నై : వి ది లీడర్స్ ఫౌండేషన్ చీఫ్ మెంటార్, బీజేపీ మాజీ చీఫ్ కె. అన్నామలై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తారని, ఎవరినీ “ఎక్కువ లేదా తక్కువ”గా భావించరని కూడా మాజీ బీజేపీ నేత అన్నారు. నేను హిందువుని, విభూతి, కుంకుమ ధరిస్తాను. కానీ బయటకు వచ్చినప్పుడు, నా కులం , మతాన్ని ఇంట్లోనే ఉంచి, ప్రజలందరికీ చెందిన సాధారణ వ్యక్తిగా మీ ముందు నిలబడతాను. ప్రతిసారీ మతాన్ని హైలైట్ చేయాల్సిన లేదా ప్రదర్శించాల్సిన అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజమైన హిందువు అందరినీ సమానంగా చూస్తాడని, ఒకరు గొప్పవారని, మరొకరు తక్కువ వారని భావించరన్నారు. అందరూ ఒకే మార్గంలో కలిసి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇదే హిందూ తత్వ శాస్త్రంలో ఉందన్నారు.
కులం, మతం అనేవి ఈ ఉద్యమానికి అతీతమైనవని, కులం, మతం ఆధారిత రాజకీయాలు ఇక చాలు అని షాకింగ్ కామెంట్స్ చేశారు కె. అన్నామలై. ప్రతి వ్యక్తి జీవితంలోనూ మతం అత్యంత ముఖ్యమైనదే అయినప్పటికీ, అది వ్యక్తిగత పరిధిలోనే ఉండాలని ఆయన పేర్కొన్నారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టినందుకు మహాత్మా గాంధీని కొనియాడిన అన్నామలై, ‘వీ ది లీడర్స్’ (We The Leaders) సంస్థలో ప్రజా సేవ, తమిళనాడులో మార్పు , మహిళా సాధికారత ప్రధాన అంశాలుగా ఉంటాయని చెప్పారు.
కరూర్ ప్రాంతంలోని లబ్ధిదారులకు ‘ఇనామ్’ (Inam) వర్గం భూములను కేటాయించే టీవీకే (TVK) ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు ఇవ్వడం ద్వారా తాను హిందూ వ్యతిరేకిగా మారాడన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆ భూములకు ఆలయ ఆస్తులతో ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, 39 ఏళ్ల లోపు వయసున్న ఓటర్లే ప్రభుత్వ మార్పునకు కారణమయ్యారని ఆయన అన్నారు. 2031 ఎన్నికల్లో కూడా యువ ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారన్న నమ్మకాన్ని అన్నామలై వ్యక్తం చేశారు.