రాష్ట్ర ఎన్నికల అధికారిని కలిసిన జర్నలిస్టులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని బుధవారం కలిసింది ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్రైడే ఈవెనింగ్ టీమ్. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్న దాని ప్రాముఖ్యతను, ప్రతి పౌరుడి అత్యంత పవిత్రమైన ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కును కాపాడాల్సిన అవసరాన్ని గుర్తించి, మనసున్న స్నేహితుల బృందం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సమావేశమైంది. ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కు సంబంధించిన పలు సమస్యలను వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని ఎన్నికల సీఈఓను కలిసి సమర్పించింది. బూర్గుల రామకృష్ణారావు భవన్ లో దాదాపు ముప్పై నిమిషాలకు పైగా సాగిన సమావేశంలో CEO ప్రతినిధి బృందం లేవనెత్తిన ప్రతి సమస్యను ఓపికగా విన్నారు. వాటిల్లో వ్యక్తిగత ఫిర్యాదుల నుండి సమాజాన్ని ప్రభావితం చేసే విస్తృత సమస్యల వరకు ఉన్నాయి. బృందం సమర్పించిన మూడు కీలక ప్రతిపాదనలకు ఆయన సానుకూలంగా స్పందించారు.
సీఈఓను కలిసిన వారిలో ఎమ్మెల్సీ కోదండరాం, సీనియర్ జర్నలిస్టులు కొండుభట్ల రామచంద్రమూర్తి, మల్లెపల్లి లక్ష్మయ్య, దేవులపల్లి అమర్, ఎ.సాయే శేఖర్, దూరదర్శన్ మాజీ ఉద్యోగి ఎన్.వి. హనుమంతరావు, జి.కె. మూర్తి, చార్టెడ్ అకౌంటెంట్ కె.డి. ప్రసాద్, దంత వైద్యులు డా.ఐతరాజు భారత్ బాబు, పిఆర్ ప్రొఫెషనల్ వనం జ్వాలా నరసింహారావు తదితరులు ఉన్నారు.
- ఎన్నికల జాబితాల నుండి పేర్ల తొలగింపు – బృందంలోని ఒకరిద్దరి పేర్లు కూడా తొలగిపోవడం
- ఓటరు రికార్డుల్లో స్పెల్లింగ్ తప్పులు
- 2002 ఎన్నికల జాబితాల నుండి ఓటరు వివరాలను గుర్తించడంలో ఇబ్బందులు
- బహుభాషా నమోదుల్లో అసమానతలు
- గణనీయమైన సంఖ్యలో బూత్ లెవెల్ అధికారుల BLOలకు సరైన అవగాహన , శిక్షణ లేకపోవడం
- అన్నిటికంటే ముఖ్యంగా, తుది ఎన్నికల జాబితాల్లో తమ పేర్లు కొనసాగుతాయా లేదా అనే ఆందోళన పౌరుల్లో పెరగడం
ప్రస్తుతం పౌరుల్లో అనిశ్చితి వాతావరణం నెలకొందని బృందం వివరించింది. చాలా మంది తమ పేర్లు ఓటరు జాబితాలో ఉంటాయా లేక పొరపాటున తొలగిస్తారా అని సందేహిస్తున్నారని తెలిపింది. సవరణ ప్రక్రియలో ఉన్న ఆచరణాత్మక, విధాన పరమైన సవాళ్లను వివరించి, ప్రతి అర్హత కలిగిన పౌరుడి రాజ్యాంగ, ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు హక్కును వివక్ష లేకుండా కాపాడటానికి దిద్దుబాటు చర్యలు తక్షణమే అవసరమని స్పష్టం చేసింది.
- శాశ్వత నివాస ధృవీకరణ పత్రం జారీ చేయడం. అన్ని అధికారిక అవసరాలకు కాకపోయినా, కనీసం ఎన్నికల నమోదుకు అర్హతను నిర్ధారించడానికి అయినా ఈ సర్టిఫికెట్ జారీ చేయాలి. ఇది పౌరులపై భారాన్ని గణనీయంగా తగ్గించడంతో పాటు ఓటింగ్ కోసం వారి నివాస హోదాను నిరూపించడానికి ఉపయోగ పడుతుంది.
- గడువు పొడిగింపు
- ప్రతి అర్హత కలిగిన వయోజన పౌరుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓటు హక్కును పొందేలా, వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి.
ఈ చర్య ముఖ్యంగా వృద్ధులు, కంప్యూటర్ పరిజ్ఞానం లేని, తక్కువ అక్షరాస్యత కలిగిన ఓటర్లకు ఎంతో ఉపయోగ పడుతుందని బృందం పేర్కొంది. BLOలు పంపిణీ చేసే పొడవైన ఫారాలను నింపడంలో వారు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. అనేక మంది BLOలకు కూడా విధానపరమైన స్పష్టత, శిక్షణ అవసరమని, అందువల్ల సరళమైన, పౌర-స్నేహపూర్వక ధృవీకరణ విధానం అవసరమని బృందం అభిప్రాయ పడింది . చివరకు ప్రతినిధి బృందం లేవనెత్తిన అంశాలను ప్రధాన ఎన్నికల అధికారి ఓపికగా వినడమే కాకుండా, తాము వాటిని పరిష్కారించే దిశగా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.