శివ చరణ్ రెడ్డి వ్యవహారంపై టీపీసీసీకి నివేదిక

హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న శివ చరణ్ రెడ్డి. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈశ్వరమ్మ యాదవ్ కు యాదగిరిగుట్ట దేవాలయ పాలక మండలి సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది. అయితే తన తండ్రి ఫోటో లేకుండా ఫ్లెక్సీ వేశారంటూ బూతులతో రెచ్చి పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో , ఆడియో వైరల్ అయ్యింది. బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారంతా భగ్గుమన్నారు. శివ చరణ్ రెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు వెళ్లారు. దీంతో ఈ వ్యవహారం పై సీరియస్ అయ్యింది టీపీసీసీ. వివరణ ఇవ్వాల్సిందిగా డీసీసీ చీఫ్ చల్లా నరసింహా రెడ్డిని ఆదేశించింది. ఈ మేరకు ఆయన శివ చరణ్ రెడ్డి, ఈశ్వరమ్మ అంశంపై చర్చించారు.
శివ చరణ్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి లను పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నాం అని తెలిపారు డీసీసీ ప్రెసిడెంట్. ఈశ్వరమ్మ దగ్గర నుండి కూడా ఏం జరిగిందనే దానిపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. అనుకోని సంఘటనను కొన్ని కుల సంఘాలు తమకి అనుకూలంగా మార్చుకున్నారంటూ ఆరోపించారు. పార్టీ గైడ్ లైన్స్ ప్రకారం చర్యలు తీసుకుంటాం అని పేర్కొన్నారు. అన్ని విషయాలను పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు వివరిస్తాం అని వెల్లడించారు. రేపటి లోపు మా నివేదికను పీసీసీ చీఫ్ కు అందిస్తాం అన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. కొంత మంది నాయకుల కుట్రతో వివాదం నెలకొందని ఆరోపించారు. ఎల్బీ నగర్ నియోజకవర్గంలో అగ్ర కులాలకు, బీసీలకు మధ్య వివాదం పార్టీకి ఇబ్బందిగా మారిందన్నారు.