ప్రపంచ వ్యాప్తంగా జన నాయగన్ సెన్సేషన్
చెన్నై : తమిళ సినీ పరిశ్రమలో అత్యంత జనాదరణ పొందిన నటుడు , ప్రస్తుత సీఎం తలపతి విజయ్ నటించిన చిత్రం జన నాయగన్ . జూలై 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమైంది. 7 వేలకు పైగా స్క్రీన్స్ సందడి చేయనున్నాయి. ఒక్క తమిళనాడు లోనే 3,500కు పైగా స్క్రీన్లలో విడుదలవుతోంది. సెన్సార్ సమస్యలు, ఆన్లైన్ లీక్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన తర్వాత, నటుడి నుండి తమిళనాడు ముఖ్యమంత్రిగా మారిన విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ ఎట్టకేలకు థియేటర్లలోకి వస్తోంది. వాస్తవానికి జనవరిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం, ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
విడుదలకి నాలుగు రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమై, బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులను బద్దలు కొట్టాయి. అడ్వాన్స్ బుకింగ్స్ , ప్రస్తుత ట్రెండ్స్‌ను బట్టి చూస్తే, ‘జన నాయగన్’ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా ప్రారంభ వసూళ్లను (ఓపెనింగ్) నమోదు చేస్తుందని అంచనా. ఇందులో మొదటి రోజు నికర వసూళ్లు రూ. 50 కోట్లకు పైగా ఉంటాయని భావిస్తున్నారు. అలాగే విదేశాలలో ఈ చిత్రం $4 మిలియన్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. జన నాయగన్’ చిత్రానికి హెచ్. వినోత్ దర్శకత్వం వహించారు. విజయ్‌తో పాటు పూజా హెగ్డే, బాబీ డియోల్, మమిత బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, నరైన్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ‘టాక్సిక్’ (Toxic) చిత్రాన్ని నిర్మిస్తున్న KVN ప్రొడక్షన్స్ సంస్థే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తోంది.