26న రాష్ట్ర పండుగగా ప్రగడ కోటయ్య జయంతి

అమరావతి : ఏపీ కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26న చేనేత సమస్యల పరిష్కారానికి విశేష కృషి చేసిన ప్రజాబంధు ప్రగడ కోటయ్య జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించనున్నామని మంత్రి సవిత వెల్లడించారు. చీరాలలో ప్రగడ కోటయ్య రాష్ట్ర స్థాయి జయంతిని జరపనున్నట్లు వెల్లడించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ఆరోపణలు చేయడమే తప్ప నిరూపించడం చేతకాదంటూ ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడమే ఆయన లక్ష్యమని మంత్రి సవిత విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ హామీని జగన్ నెరవేర్చలేదంటూ తీవ్ర స్తాయిలో ధ్వజమెత్తారు.
ఏటా జాబ్ క్యాలెండర్, సీపీఎస్ రద్దు, డీఎస్సీ నిర్వహణ, సంపూర్ణ మద్యపాన నిషేధం, ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి అని హామీలు ఇచ్చారని కానీ ఇందులో ఏ ఒక్క హామీని కూడా ఆయన నెరవేర్చలేదన్నారు మంత్రి ఎస్. సవిత. కూటమి ప్రభుత్వంపై జగన్ రెడ్డికి మాట్లాడే నైతిక హక్కే లేదన్నారు. అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తన మొదటి సంతకం మెగా డీఎస్సీ నిర్వహణ ఫైల్ సంతకం చేసి, తనమాట నిలబెట్టుకున్నారని అన్నారు. గతంలోనూ సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో పారదర్శకతతో డీఎస్సీలు నిర్వహించారని గుర్తు చేశారు. గతేడాది మెగా డీఎస్సీని కూడా అవకతవకలకు తావులేకుండా పూర్తి చేశారని మంత్రి సవిత కొనియాడారు.