newsseals.com
News

పొగాకు రైతుల సమస్యలకు శాశ్వ‌త ప‌రిష్కారం చూపాలి

VijayaBhaskar July 26, 2026
newsseals-CM

అమ‌రావ‌తి : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు పొగాకు రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కొనుగోలుదారులు, ఇతర భాగస్వాముల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటూనే, రైతు ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని ఆయన స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పర్యటనకు ముందు, అమరావతిలో కేంద్ర అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర వాణిజ్య శాఖ నుండి అదనపు కార్యదర్శి నితిన్ కుమార్ యాదవ్ , డైరెక్టర్ మౌనిక గౌర్‌లను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు పంపింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్ , డి.బి.వి. స్వామి, వ్యవసాయ శాఖ, మార్క్‌ఫెడ్ ఉన్నతాధికారులు, పొగాకు బోర్డు ప్రతినిధులు పాల్గొన్నారు.

పొగాకు సాగుదారులకు తక్షణ ఉపశమనం కల్పించే లక్ష్యంతో మూడు ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. వడ్డీ లేని నిర్వహణ మూలధన రుణాలు , ఆర్థిక ప్రోత్సాహకాలు, ధరల వ్యత్యాస పరిహార విధానం, రైతులపై ప్రతికూల ప్రభావం చూపేలా ఎటువంటి నిర్ణయం తీసుకోకూడదని నాయుడు అన్నారు . చర్యలను ఖరారు చేసే ముందు సమగ్ర సమీక్ష జరపాలని సూచించారు. దీర్ఘకాలిక పరిష్కారం అవసరమని నొక్కిచెప్పిన నాయుడు, సంక్షోభం పునరావృతం కాకుండా ఉండేందుకు స్వల్ప, మధ్య , దీర్ఘకాలిక వ్యూహాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కేంద్రం నుండి ఆశించాల్సిన మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలను గుర్తించాలని ఆయన అధికారులను కోరారు. శాశ్వత పరిష్కారం కోసం రైతులు, కొనుగోలుదారులు, పొగాకు బోర్డు, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వంటి కీలక భాగస్వాముల మధ్య సమన్వయంతో కూడిన కృషి అవసరమని సీఎం పేర్కొన్నారు.