newsseals.com
DEVOTIONAL

సింహాచ‌లం గిరి ప్రదక్షిణ‌కు పోటెత్తిన భ‌క్తులు

VijayaBhaskar July 28, 2026
newsseals-Simhachalam

విశాఖ‌ప‌ట్నం జిల్లా : విశాఖ జిల్లా లోని ప్ర‌ముఖ పుణ్యక్షేత్రం సింహాచ‌లం కు పోటెత్తారు భ‌క్తులు. 32 కి.మీ. గిరి ప్రదక్షిణకు భక్తుల భారీగా తరలి వచ్చారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం నుండే వేలాది మంది భక్తులు సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి చేరుకోవడం ప్రారంభించారు. సంప్రదాయం ప్రకారం, పవిత్ర కొండ చుట్టూ గిరి ప్రదక్షిణను ప్రారంభించే ముందు భక్తులు కొబ్బరికాయలు కొట్టి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భం కోసం ఆలయ అధికారులు మండపాన్ని ప్రత్యేక పూలతో అలంకరించారు. మధ్యాహ్నం 2:30 గంటలకు పుష్ప రథం ఊరేగింపుతో గిరి ప్రదక్షిణ అధికారికంగా ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.

అశోక్ గజపతి రాజు , ఆయన కుటుంబ సభ్యులు గిరి ప్రదక్షిణ మహోత్సవ ప్రారంభ సూచికగా తొలి పూజను నిర్వహించనున్నారు. నిర్ణీత సమయానికి ముందే భక్తులు ఆలయ ప్రాంగణానికి భారీగా తరలి రావడంతో సింహాచలం ప్రాంతం యాత్రికులతో కిక్కిరిసి పోయింది. యాత్ర ప్రారంభమయ్యే సింహాచలం కొండ పాదాల వద్ద ఉన్న ‘తొలిపావంచ’ ప్రాంతం భక్తులతో నిండి పోయింది. ఈ గిరి ప్రదక్షిణ మహోత్సవంలో దాదాపు 10 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ,ఇతర రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం తాగునీరు, వైద్య సదుపాయాలు, పారిశుధ్యం, భద్రత వంటి విస్తృత ఏర్పాట్లను అధికారులు చేశారు.