newsseals.com
News

పార్టీ గీత దాటితే వేటు త‌ప్ప‌దు : టీడీపీ చీఫ్

VijayaBhaskar July 29, 2026
newsseals-APCM

అమ‌రావ‌తి : తెలుగుదేశం పార్టీ అత్యంత క్ర‌మ‌శిక్ష‌ణ‌కు ప్రాధాన్య‌త ఇస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఇటీవ‌ల కొంద‌రు త‌మ ఇష్టానుసారం బాధ్య‌తా రాహిత్యంతో మాట్లాడుతున్నార‌ని ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పార్టీకి చెందిన నాయ‌కులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, చైర్మ‌న్లు, వివిధ స్థాయిల‌లో ప‌ద‌వుల‌లో ఉన్న వారు పార్టీ నియ‌మావ‌ళికి క‌ట్టుబ‌డి ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. లేక పోతే ఎంత‌టి వారైనా ఏ స్థాయిలో ఉన్న‌ప్ప‌టికీ వారిపై నిర్దాక్షిణ్యంగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ప్ర‌తి ఒక్క‌రికీ పార్టీ ప‌రంగా ఒక లైన్ అనేది ఉంటుంద‌ని, దానిని తెలుసుకుని మ‌సులు కోవాల‌ని పేర్కొన్నారు టీడీపీ చీఫ్‌.

నాయకుల ప్రవర్తన, వ్యాఖ్యలు, జరుగుతున్న పరిణామాల ఆధారంగా అవసరమైతే వివరణ కోరుతున్నామని తెలిపారు. తెలియక కొందరు తప్పులు చేస్తున్నా, ఇకపై అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని, పార్టీ సిద్ధాంతాలే అత్యంత ప్రధానమని ప్రతి నాయకుడు గుర్తుంచు కోవాలని సూచించారు. ప్రజల్లోనూ, పార్టీ క్యాడర్‌లోనూ అపోహలు సృష్టించే వ్యాఖ్యలు ఎవరూ చేయరాదన్నారు. పార్టీ నిర్దేశించిన లైన్‌లోనే ప్రతి ఒక్కరూ నడవాలని, పార్టీకి లేదా కూటమికి విఘాతం కలిగించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని హెచ్చరించారు.

ప్రస్తుతం పార్టీ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నందున కూటమి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని ఏపీ పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. 2029 ఎన్నికల విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు పని చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ప్రస్తుతం ప్రతి నాయకుడి ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు.