వీబీ జీ రామ్ జీతో వలసలకు బ్రేక్
శ్రీ సత్యసాయి జిల్లా : జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో ఏర్పాటు చేసిన వీబీ జీ రామ్ జీ పథకంతో ఎల్ నినో కరువు పరిస్థితులు ధీటుగా ఎదుర్కొందామని మంత్రి సవిత పిలుపునిచ్చారు. వీబీ జీ రామ్ జీ పథకంలో పని దినాలు పెంచారన్నారు. దీనివల్ల వలసలకు అడ్డుకట్ట వేయొచ్చునన్నారు. అదే సమయంలో గ్రామాల్లో రోడ్లు, డ్రైనీజీలు, సాగునీటి కాలువ నిర్మాణాలు కూడా చేపట్టేందుకు ఆస్కారం ఉందన్నారు. జల జీవన్ మిషన్ కింద రూ.11.50 కోట్లు మంజూరయ్యాయని, ఆ నిధులతో తాగునీటి కల్పనకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు అందరూ ఐక్యంగా, సమన్వయం చేసుకుంటూ ఎల్ నినో వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొందామని మంత్రి సవిత పిలుపునిచ్చారు.
ఎల్ నినో కారణంగా వర్షాభావ పరిస్థితులు రైతులు గట్టెక్కాల తక్కువ నీటి ఆధారిత పంటలు సాగు చేయాలని మంత్రి సవిత పిలుపునిచ్చారు. ప్రస్తుతం వర్షాలు కురిసినా, రాబోయే నాలుగు నెలలు తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదముందన్నారు. చిరు ధాన్యాల సాగుకు తక్కువ నీరు అవసరమవుతుందని, ఈ దిశగా రైతులు ఆలోచించాలని సూచించారు. ఎల్ నినోపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కరోనా కంటే తీవ్ర నష్టాన్ని ఎల్ నినో కలిగించనున్నట్లు అధికారులువెల్లడించారు. 140 దేశాల్లో ఎల్ నినో ప్రభావం ఉందని మంత్రి సవిత తెలిపారు.
ఎల్ నినో ప్రభావం పశువులపైనా ఉండబోతోందని పేర్కొన్నారు. వర్షాలు కురవక పోవడం వల్ల నీటి ఎద్దడి తలెత్తుతుందన్నారు. పంటలు దెబ్బతినడంతో పశు గ్రాసం కొరత ఏర్పడుతుందన్నారు. ఈ విపత్తు నుంచి పశువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. నియోజక వర్గం వ్యాప్తంగా ఉన్న చెరువులను గుర్తించి, నీరు లేని చోట పశు గ్రాసం పెంచడానికి చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖాధికారులకు మంత్రి ఆదేశించారు. సాగు చేసిన పశు గ్రాసాన్ని రైతులకు అందజేయాలని స్పష్టంచేశారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముందు చూపుతో నిర్మించిన నీటి తొట్టెలు ఎంతగానో ఉపయోగపడ నున్నాయన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి తొట్టెలను నింపి, పశువుల దాహాన్ని తీర్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సవిత ఆదేశించారు.