newsseals.com
DEVOTIONAL

బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి : ఏఈవో

Posted by: VijayaBhaskar August 6, 2026
newsseals-AEO

తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం బ్రహ్మోత్సవాల నిర్వ‌హ‌ణ‌పై స‌మీక్ష చేప‌ట్టారు. టీటీడీ జేఈవో డాక్టర్ ఏ.శరత్, సీవీఎస్వో మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి వివిధ శాఖల ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ బస్సుల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పార్కింగ్ స్థలాలను కేటాయించాల‌న్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్‌ల పంపిణీని విస్తృతంగా చేపట్టాలని సూచించారు.

విద్యుత్ కేబుళ్లు, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా అగ్నిప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు. జేఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుండి కూడా కళా బృందాలు విచ్చేసేలా చర్యలు చేపట్టామని తెలిపారు. సీవీఎస్వో, జిల్లా ఎస్పీ బ్రహ్మోత్సవాల్లో భద్రతా పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.