newsseals.com

కొత్త త‌రం నేరాలపై దృష్టి సారించాలి : డీజీపీ

August 10, 2026 · VijayaBhaskar

జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లా : తెలంగాణ రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. ఆయా జిల్లాలో పోలీస్ వ్య‌వ‌స్థ ప‌నితీరును ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా ప‌రిశీలిస్తున్నారు. స‌మీక్ష‌లు చేప‌డుతూ కీల‌క సూచ‌న‌లు చేస్తున్నారు. తాజాగా డీజీపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప్రొఫెస‌ర్ జయశంకర్ ఆచారి భూపాలపల్లి జిల్లాకు చేరుకున్నారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు ఎస్పీ ఆధ్వ‌ర్యంలో. పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు చేరుకున్న అనంత‌రం డీజీపీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు యూనిట్ల పనితీరును సమీక్షించారు. ఎస్పీలు నేర గణాంకాలు, కొత్త కార్యక్రమాలు, ప్రాంతంలోని ప్రధాన సవాళ్లు, మాదకద్రవ్యాల నియంత్రణ, రవాణా మార్గాలు, మోసాలు , త‌దిత‌ర‌ అక్రమాల కేసులు మొదలైనవాటిని వివరించారు.

ఇదిలా ఉండ‌గా ఈ రెండు జిల్లాల ప‌రిధిలో ప్ర‌ముఖ సంస్థ‌లు జెన్ కో, సింగరేణి కాల‌రీస్ వంటివి కొలువు తీరి ఉన్నాయి. ఇటు వంటి కీలక సంస్థల చుట్టూ భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు డీజీపీ సీవీ ఆనంద్. ఈగిల్, సిఎస్‌బి, టిజి-స్పార్క్ , సిఐడికి చెందిన ఎస్పీలు తమ పరిశీలనలు, డేటా , నిర్దిష్ట సిఫార్సులతో పాటు, రెండు యూనిట్లలో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయడానికి కార్యాచరణ ప్రణాళికల గురించి వివ‌రించారు. ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు అందరూ కొత్త తరం నేరాలపై దృష్టి సారించాలని, మాదకద్రవ్యాలపై పోరాటాన్ని వ్యక్తిగత కర్తవ్యంగా స్వీకరించాలని స్ప‌ష్టం చేశారు.

Related News