సర్ ప్రక్రియపై బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి

హైదరాబాద్ : ఎస్.ఐ.ఆర్ మొదటి దశ ప్రక్రియ కంటే రెండో దశలో బీఎల్‌ఏలు మరింత అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ రోజు నుంచి పార్లమెంట్‌ల వారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు . సర్ పై అప్రమత్తంగా ఉండాలని, ఉదాసీనత ప్రదర్శించే వారిని ఉపేక్షించ వద్దని పేర్కొన్నారు. తక్షణమే వారిని తొలగించాలని స్పష్టం చేశారు మహేష్ కుమార్ గౌడ్. సర్ ప్రక్రియ పురోగతిపై టీపీపీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ రోజు ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్‌ల సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, ఎస్.ఐ.ఆర్. ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు. మొదటి దశ ఈ రోజుతో పూర్తయిందని, రేపటి నుంచి ఎస్.ఐ.ఆర్ రెండో దశ ప్రారంభం అవుతుందని అన్నారు . ఈ దశలో చాలా అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
ఇప్పటి వరకు ఎన్‌రోల్‌మెంట్ ప్రక్రియ పూర్తయిందని, ఇక నుంచి అనామలీస్ లిస్ట్‌లను జాగ్రత్తగా గమనించాలని అన్నారు. ఇదే అత్యంత కీలకమైన ఘట్టమని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్న వర్గాల ఓటర్లను తొలగించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్‌ను ఉదాహరణగా తీసుకుని గట్టిగా పనిచేయాలని అన్నారు. అర్హత ఉన్న ఒక్క ఓటు కూడా నష్టపోకుండా చూడాలని సూచించారు.
బీఎల్‌ఏలు చాలా క్రియాశీలకంగా పనిచేయాలని, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సహించేది లేదని, సక్రమంగా పనిచేయని వారి స్థానంలో కొత్త వారిని నియమించాలని సూచించారు.