‘మావిగన్’ పేరు మార్పుపై ఎంపీ విజయ్ ధ్వజం

అమరావతి : రాజ్యసభలో కేరళ రాష్ట్రం పేరును ‘కేరళం’గా మార్చేందుకు ఉద్దేశించిన బిల్లుకు తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సభలో మాట్లాడారు. పేర్లతో ముడిపడి ఉండే భావోద్వేగాలను, బిల్లులోని రాజ్యాంగ విలువలను తాను పూర్తిగా గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు. అయితే రాజ్యాంగ విలువలపై కనీస అవగాహన లేని ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక పేరును ‘మావిగన్’గా మార్చాలని చూశారని ఆయన ప్రస్తావించారు. అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటులో ఒక రాజ్యాంగ బిల్లు ఆమోదం పొందిన తర్వాత, ఎవరూ ఆ బిల్లుకు లేదా ఆ పేరుకు వ్యతిరేకంగా వెళ్లకూడదని అన్నారు. కానీ రాజ్యాంగంపై గౌరవం లేని వ్యక్తులు ఇప్పుడు ఆ పేరును వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు.
సభలో మాట్లాడుతున్న సమయంలో తన ప్రసంగానికి అంతరాయం కలగగా.. తాను అంశాన్ని పక్కదారి పట్టించడం లేదని స్పష్టం చేశారు ఎంపీ విజయ్. కేవలం బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ విలువల గురించే మాట్లాడుతున్నానని చైర్కు విజయ్ వివరణ ఇచ్చారు. ‘కేరళం’ అనే పేరుతో ముడిపడి ఉన్న భావోద్వేగాలను గౌరవిస్తూ తాను ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నానని స్పష్టం చేశారు. దేశంలో వలసవాద పేర్లను సమూలంగా రూపుమాపుతూ, మన దేశ మూలాలను , సంప్రదాయాలను రక్షిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఈ సందర్భంగా ఎంపీ విజయ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.