newsseals.com

తుమ్మలను కలిసిన కోస్టారికా ఏఎస్‌డీ కంపెనీ ప్రతినిధులు

August 14, 2026 · VijayaBhaskar

హైద‌రాబాద్ : కోస్టారికా ఏఎస్డీ కంపెనీ ప్ర‌తినిధులు మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావును మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగుకు అవసరమైన నూతన తరం, అధిక నాణ్యత గల ఆయిల్‌పామ్ విత్తనాలను కోస్టారికా నుంచి సరఫరా చేసే అంశంపై మంత్రితో చర్చించారు. కోస్టారికాలో అభివృద్ధి చేసిన నూతన తరం ఆయిల్‌పామ్ విత్తన రకాలు అధిక ఎఫ్‌ఎఫ్‌బీ దిగుబడితో పాటు అధిక OER సాధించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఈ రకాల్లో Short Leaf / Compact Canopy లక్షణాలు ఉండటం వల్ల మొక్కలు తక్కువ ఎత్తులో ఆకులను విస్తరించి, ఆయిల్‌పామ్ తోటల్లో యాంత్రీకరణకు మరింత అనుకూలంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఆయిల్‌పామ్‌లో తీవ్ర ప్రభావం చూపే Ganoderma వ్యాధిని తట్టుకునే సామర్థ్యం కలిగిన నూతన రకాలు కూడా తమ వద్ద అందుబాటులో ఉన్నాయని వివరించారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతులకు ప్రయోజనం చేకూర్చే అధిక దిగుబడినిచ్చే నూతన రకాలను అందుబాటులోకి తీసుకు రావడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కోస్టారికాలో అభివృద్ధి చేసిన ఈ నూతన రకాలపై సమగ్రంగా అధ్యయనం చేసి, తెలంగాణ వాతావరణ పరిస్థితులకు వాటి అనుకూలతను పరిశీలించాల‌న్నారు. ఈ నూతన రకాలు తెలంగాణ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే, వాటిని రాష్ట్రంలోని నర్సరీల్లో అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకు రావాలని మంత్రి సూచించారు.

Related News