స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారతకు దర్పణం

అమరావతి : స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచిందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి మహిళలతో సహా సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. స్త్రీ శక్తి లబ్దిదారులకు తేనేటీ విందు ఇచ్చారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన మహిళలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. మహిళలతో మాట్లాడారు సీఎం చంద్రరబాబు నాయుడు. వారి కుటుంబ వివరాలు.. ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురిచేసి ఓట్లేయించుకునే వారిని నమ్మొద్దన్నారు. రాబోయే 10 ఏళ్లలో ఏయే లక్ష్యాలను నిర్దేశించుకున్నారంటూ సీఎం ప్రశ్నలు వేశారు.
కోటి రూపాయల పెట్టుబడితో తన డ్వాక్రా సంఘం నుంచి వ్యాపారం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు కడప జిల్లాకు చెందిన ముస్లిం మహిళ. ఏఐ రంగంలో నైపుణ్యం సాధించడం ద్వారా తాను ఎంచుకున్న సాఫ్ట్ వేర్ రంగంలో టాప్ పొజిషనులోకి వెళ్లాలని వివరించారు విశాఖకు చెందిన ఓ ఉద్యోగిని. స్త్రీ శక్తి ద్వారా సుమారు రూ. 3 వేలు ఆదా చేసుకోగలుగుతున్నామని తెలిపారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో మహిళలే ఎక్కువగా సంపాదిస్తున్నారని ,తాము కూడా మరికొందరికి ఉపాధి చూపగలుగుతున్నామని పేర్కొన్నారు మహిళలు. అమరావతి నిర్మాణాలను చూడాలని ఉందని కోరారు.
స్త్రీ శక్తి పథకం ప్రారంభించి నేటితో ఏడాది అయింది. ఇప్పటి వరకు 87 కోట్ల ప్రయాణాలు జరిగాయన్నారు సీఎం. వివిధ ప్రాంతాలకు ఉచితంగా మహిళలు వెళ్లే వెసులుబాటు కల్పించాం అన్నారు. రాబోయే రోజుల్లో అందరి ఆదాయం పెరగాలి. అందరి ఆరోగ్యం బాగుండాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు… దీన్ని నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు.