బీసీఐ చైర్మన్ పై భగ్గుమన్న న్యాయవాదులు
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మానన్ కుమార్ మిశ్రా . నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా విద్యార్థుల వివాదం ఇప్పుడు మరో కీలక మలుపు తిరిగింది . బీసీఐ చైర్మన్ రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా 700 మందికి పైగా సభ్యులున్న మూడు న్యాయవాదుల సంఘాలు డిమాండ్ చేశాయి.హైదరాబాద్‌లోని నల్సార్ లో 2026 బ్యాచ్ విద్యార్థులు తమ కాన్వొకేషన్‌కు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సూర్యకాంత్‌ను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం వివాదానికి దారితీసింది. విద్యార్థుల అభిప్రాయాలను నిరసనగా చూడకుండా బీసీఐ మొదట 2026లో నల్సార్ నుంచి పట్టభద్రులయ్యే విద్యార్థులను రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో అడ్వొకేట్లుగా నమోదు చేయకూడదని ఆదేశించింది. ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు దారితీసింది.
కొద్ది కాలానికే బీసీఐ ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అనంతరం మానన్ కుమార్ మిశ్రా విద్యార్థులకు క్షమాపణలు కూడా చెప్పారు. ఆగస్టు 15న విడుదల చేసిన సందేశంలో విద్యార్థుల భావాలు దెబ్బతిన్నట్లయితే తాను చింతిస్తున్నానని తెలిపారు .ఈ వ్యవహారం సుప్రీంకోర్టు దృష్టికి వెళ్లింది. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విద్యార్థులు శాంతియుతంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఉందని పేర్కొంది. బీసీఐ లేదా రాష్ట్ర బార్ కౌన్సిళ్లు విద్యార్థులు లేదా అధ్యాపకులపై బలవంతపు చర్యలు తీసుకోకుండా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్ ఫర్ జస్టిస్ , నేషనల్ అలయన్స్ ఫర్ జస్టిస్ అకౌంటబిలిటి అండ్ రైట్స్ , క్వీర్ లాయర్స్ సోసియేషన్ అనే మూడు సంఘాలు మిశ్రాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఆయన రాజీనామా చేయకపోతే BCIలోని ఇతర సభ్యులు ఆయనపై అవిశ్వాస తీర్మానం తీసుకు వస్తారని హెచ్చరించింది.