newsseals.com

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి

August 21, 2026 · VijayaBhaskar

తాడేప‌ల్లి గూడెం : వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం వైెఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేన‌ని, మంత్రి లోకేశ్ రాజీనామా చేయాల్సిందేన‌ని డిమాండ్ చేశారు. పేపర్ లీక్ అయిందా? ప్రశ్నలు లీక్ చేశారా? పూర్తి నిజానిజాలు తేల్చి చెప్పాల‌న్నారు.-అవకతవకలకు బాధ్య‌త‌ ఎవరు వహిస్తారో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారంపై సమాధానం చెప్పకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిప‌డ్డారు. అర్హత సాధించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల‌ని అన్నారు. డీఎస్సీపై విచారణకు జగన్ మోహన్ రెడ్డి విసిరిన సవాల్‌ను ప్రభుత్వం స్వీకరించాలని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ.. దానిపై బురదజల్లే ప్రయత్నాలు ఆపాలన్నారు జూపూడి ప్ర‌భాక‌ర్ .

ఏపీపీఎస్సీలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ జర‌పాల‌ని, త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌న్నారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ వ్యవహారాలపై నిష్పక్షపాత విచారణకు వైఎస్సార్‌సీపీ సవాల్ విసురుతోంద‌న్నారు. నిరుద్యోగుల భవిష్యత్తుతో చెలగాటం ఆడితే సహించం అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగాల భర్తీలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అనర్హులకు అవకాశాలు ఇవ్వడం విద్యా వ్యవస్థకు నష్టం కలిగింద‌న్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో నిబంధనలను పక్కన పెడితే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బ తింటుందని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
విద్యార్థులు, నిరుద్యోగులు, తల్లిదండ్రుల ఆందోళనలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులదేన‌ని పేర్కొన్నారు జూపూడి ప్ర‌భాక‌ర్ .

Related News