తెలంగాణలో భారీ వర్షాలు కురిసే ఛాన్స్
హైదరాబాద్ : తెలంగాణ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఒకటి లేదా రెండు సార్లు మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అల్పపీడన ప్రాంతం (LPA) కారణంగా, ఈ రోజు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. IMD (భారత వాతావరణ శాఖ) ప్రకారం, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, నిర్మల్ , నిజామాబాద్ జిల్లాల్లో విస్తారంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అంతే కాకుండా కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, హన్మకొండ, వరంగల్, జనగాం, సూర్యాపేట, ఖమ్మం, నల్గొండ, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి, మహబూబ్నగర్, వనపర్తి , నారాయణపేట జిల్లాల్లో రాబోయే 24 గంటల్లో విస్తారంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్లో మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ఒకటి లేదా రెండు సార్లు మోస్తరు వర్షం కురుస్తుందని అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.