ఆవిష్కరణలకు వేదిక పవర్ ఎగ్జిబిషన్
హైదరాబాద్ : హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా వేదికగా టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పవర్ ఎగ్జిబిషన్–2026 రెండో రోజు సందర్శకులతో కళకళలాడింది. ఉదయం నుంచే పాఠశాల విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్‌ను సందర్శించి విద్యుత్ రంగంలో చోటు చేసుకుంటున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, విద్యుత్ పంపిణీ వ్యవస్థ, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సంస్కరణలపై ఆసక్తిగా అవగాహన పొందారు. ప్రత్యేకంగా స్కూల్ విద్యార్థులు వివిధ స్టాళ్లను సందర్శిస్తూ విద్యుత్ ఉత్పత్తి నుండి వినియోగదారుల ఇళ్ల వరకు విద్యుత్ ఎలా చేరుతుందనే అంశాలను అధికారులు, ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్‌స్టేషన్లు, స్మార్ట్ మీటర్లు, విద్యుత్ భద్రతా పరికరాలు, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థలు, పునరుత్పాదక ఇంధన వనరులు వంటి అంశాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
విద్యుత్ రంగంలో ఉపయోగిస్తున్న ఆధునిక సాంకేతికతలు, కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత సేవలు, కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరు, విద్యుత్ అంతరాయాల నివారణకు చేపడుతున్న చర్యలు, వినియోగదారులకు అందిస్తున్న ఆన్‌లైన్ సేవల గురించి అధికారులు వివరించారు. విద్యార్థులు తమ సందేహాలను అడిగి నివృత్తి చేసుకుంటూ విద్యుత్ రంగంపై మరింత అవగాహన పెంపొందించు కున్నారు. అలాగే విద్యుత్ భద్రతకు సంబంధించిన ప్రత్యేక స్టాళ్లలో విద్యుత్ ప్రమాదాల నివారణ, సురక్షిత వినియోగ పద్ధతులు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రదర్శనలు నిర్వహించారు. ఈ ప్రదర్శనలు విద్యార్థులకు విద్యుత్ భద్రతపై విలువైన అవగాహన కల్పించాయి. మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ పవర్ ఎగ్జిబిషన్ ద్వారా తెలంగాణ విద్యుత్ రంగంలో జరుగుతున్న అభివృద్ధి, సాంకేతిక పురోగతి, వినియోగదారుల సేవల మెరుగుదలపై ప్రజలకు ప్రత్యక్ష అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యమని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ పాటిల్ తెలిపారు.