ప్రమాదకరమైన భవనాలు తొలగించిన హైడ్రా
హైదరాబాద్ : హైదరాబాద్ లోని అంజయ్యనగర్‌లో ప్రమాదకరమైన భవనాలను గుర్తించి, వాటిని కూల్చివేసేందుకు చర్యలు చేపడుతున్నాం అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్‌తో కలిసి సోమవారం ఆ ప్రాంతాన్ని సందర్శించి, ప్రమాదకరమైన భవనాల కూల్చివేత పనులను సమీక్షించారు. శేరిలింగంపల్లి మండలం అంజయ్యనగర్‌లో శనివారం ఒక 7 అంతస్తుల భవనం కూలిపోయింది. దాని పక్కనే ఉన్న మరో 7 అంతస్తుల భవనం కూడా ఇప్పుడు ప్రమాదకర స్థితికి చేరింది. సీఎంసీ, హైడ్రా సంయుక్త ఆధ్వర్యంలో
ఆ ప్రభావిత భవనం కూల్చివేత పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ పనులు సోమవారం కూడా కొనసాగుతున్నాయి. సమీపంలోని మరికొన్ని భవనాలు కూడా ప్రమాదకరంగా ఉన్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వాటిని కూడా పరిశీలించి కూల్చివేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు కమిషనర్ ఏవీ రంగనాథ్.
వరద కాలువను పాక్షికంగా ఆక్రమించడం, కేవలం 50 చదరపు గజాల స్థలంలో ఏడు నుంచి ఎనిమిది అంతస్తుల భవనాలను నిర్మించడం వల్ల వాటి నిర్మాణ భద్రత దెబ్బతిన్నదని కమిషనర్ పేర్కొన్నారు. 50 చదరపు గజాల స్థలంలో రెండు అంతస్తులకు మాత్రమే అనుమతులు తీసుకుని, దానికి అనుగుణంగా పిల్లర్లు, పునాదులు వేశారు.. కానీ పైన ఏడు అంతస్తుల భవనాలను నిర్మించడం వల్ల భవన సామర్థ్యం మించి పోయిందని అన్నారు. అనుమతులు లేకుండా నిబంధనలను విస్మరించి, పక్కన ఉన్న నిర్మాణాలను పరిగణనలోకి తీసుకోకుండా నిర్మించిన భవనాల విషయంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు దీనివల్ల భవన కూల్చివేత పనుల్లో కొంత జాప్యం జరుగుతోందని, ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతం మొత్తాన్ని ఖాళీ చేయించామని స్పష్టం చేశారు ఏవీ రంగనాథ్.