హైదరాబాద్ లో సర్ ప్రక్రియపై పరిశీలన : కమిషనర్
హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన సర్ ప్రక్రియ ముగిసింది. ఓటర్ల తుది జాబితా పరిశీలన కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నగర పాలక సంస్థ కమిషనర్ కర్ణన్ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. తాజాగా కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం (AC-64) పరిధిలోని మొఘల్ నగర్, పోలింగ్ స్టేషన్లు 94 , 95 వద్ద జరుగుతున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) నోటీసుల పంపిణీ ప్రక్రియను DEO , GHMC కమిషనర్ పరిశీలించారు. ఈ పరిశీలన సందర్భంగా కమిషనర్ బూత్ స్థాయి అధికారులు (BLOs), BLO సూపర్వైజర్లు, AERO , EROలతో మాట్లాడి, నోటీసుల పంపిణీ పురోగతిని సమీక్షించారు. నోటీసులు సంబంధిత ఓటర్లకు ఎటువంటి జాప్యం లేకుండా అందేలా చూడాలని ఆదేశించారు. అలాగే ధృవీకరణ ప్రక్రియ, అవసరమైన పత్రాలు, ఫారమ్‌లు , సమర్పణ విధానం గురించి ఓటర్లకు సరైన అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
అనంతరం ఆయన స్థానిక నివాసితులతో మాట్లాడారు. SIR ప్రక్రియ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. నోటీసులో పేర్కొన్న వివరాలను జాగ్రత్తగా సరి చూసుకోవాలని, నిర్ణీత గడువులోగా అవసరమైన ప్రక్రియను పూర్తి చేయాలని ఓటర్లకు సూచించారు. ఏదైనా సందేహం లేదా సహాయం కోసం తమ సంబంధిత BLOలను సంప్రదించాలని పౌరులను కోరారు. SIR ప్రక్రియ సజావుగా , పారదర్శకంగా సాగేలా చూసేందుకు సరైన సమన్వయం, ప్రశ్నలకు తక్షణ స్పందన , ఓటర్లకు సమర్థవంతమైన సహకారం అందించడం అత్యవసరమని కమిషనర్ నొక్కి చెప్పారు.