newsseals.com

ప‌ర్యావ‌ర‌ణ ర‌హిత రాష్ట్రంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్

August 28, 2026 · VijayaBhaskar

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్రాన్ని ప‌చ్చ‌ద‌నం, ప‌ర్యావ‌ర‌ణ హితంగా మార్చేందుకు ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందులో భాగంగా ఏపీ – గ్రీన్ సంస్థ‌ను ఏర్పాటు చేశారు. దీని ముఖ్య ఉద్దేశం 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో భాగంగా 2030 నాటికి 33 శాతం పచ్చదనం పెంపొందించాలని నిర్ణయించారు. అందు కోసం సమగ్ర ప్రణాళికను పవన్ కళ్యాణ్ రూపొందించారు. వచ్చే నాలుగేళ్లలో ఏడాదికి ఎన్ని హెక్టార్ల పరిధిలో పచ్చదనం పెంపొందించాలన్న దానిపై కార్యాచరణ సిద్ధం చేశారు. ఆరు నెలలు, మూడు నెలలు, నెలవారీ లక్ష్యాలను నిర్దేశించి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి విజన్‌కు అనుగుణంగా 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 50 శాతం గ్రీన్ కవర్ సాధించే లక్ష్యంతో చేపట్టిన ఈ మహా యజ్ఞంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని AP-GREEN పరిపాలనా కార్యకలాపాలు ప్రారంభించింది.

ఏపీ గ్రీన్ మూడంచెల వ్యవస్థ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తుంది. రాష్ట్ర స్థాయి పాలక మండలికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చైర్మన్‌గా, ఏపీ గ్రీన్ ఛైర్ పర్సన్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. అటవీ, పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, విద్యాశాఖ, పరిశ్రమల శాఖ, రెవెన్యూ, జలవనరులు, రోడ్లు-భవనాల శాఖల ప్రధాన కార్యదర్శులు, పీసీసీఎఫ్ డైరెక్టర్లుగా ఉంటారు. వీరితో పాటు ఏపీ గ్రీన్ సీఈఓ, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్, స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ కన్వీనర్, కార్పొరేట్ రంగానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, విద్యా సంస్థ ప్రతినిధి, ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక అటవీకరణ రంగంలో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజానికి చెందిన ప్రతినిధులతో కలిపి మొత్తం 24 మంది పాలక మండలిలో భాగస్వాములుగా ఉంటారు.

రాష్ట్ర స్థాయి పాలక మండలి ఏటా రెండుసార్లు సమావేశమై విధానాల రూపకల్పన, ఏపీ గ్రీన్ కార్యకలాపాల పర్యవేక్షణ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. రెండో అంచెలో ఎగ్జిక్యూటివ్ కమిటీ కేబినెట్ హోదా కలిగిన ఏపీ గ్రీన్ ఛైర్‌పర్సన్ అధ్యక్షతన విధులు నిర్వహిస్తుంది. కమిషనర్ గా సీనియర్ ఐఎఫ్ఎస్ అధికారి సమన్వయ బాధ్యతలను పర్యవేక్షిస్తారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశమవుతుంది. జిల్లా స్థాయి గ్రీన్ డెవలప్‌మెంట్ అథారిటీ జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన పని చేస్తుంది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, వ్యవసాయం, ఉద్యానవనం, పరిశ్రమలు, ఆర్ అండ్ బీ, దేవాదాయ, జలవనరులు, విద్యాశాఖల అధికారులు సభ్యులుగా కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసే బాధ్యతలు చేపడతారు.

Related News