97 రద్దు చేయక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన

హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు కాంగ్రెస్ సర్కార్ పనితీరుపై. రేవంత్ రెడ్డి కి ఓటు వేసిన కర్మకు ఏ వర్గం ప్రజలు కూడా తృప్తిగా లేరన్నారు. ఇవాళ ఎంపీ మీడియాతో మాట్లాడారు. ఎవరిని కదిలించినా శాపనార్థాలు పెడుతున్నారని అన్నారు. 1965 కింద ఏర్పడ్డ ఆర్. కె. పురం కాలనీని 22 A కింద పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయి అంటున్నాడు.. నీకు దమ్ముంటే ప్రజాక్షేత్రానికి వస్తావా అని చాలెంజ్ చేస్తున్నానని అన్నారు ఈటల రాజేందర్. పాలిటెక్నిక్ కాలేజీలు కూడా రద్దు చేయడం దుర్మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న వారికి అనేక మందికి ఉద్యోగాలు వచ్చేవన్నారు. కొద్దిమంది ఇంజనీరింగ్ తీసుకొనే వారన్నారు ఎంపీ.
రేవంత్ రెడ్డికి ఏం పట్టిందో కానీ.. జీవో నెంబర్ 97 తీసుకువచ్చి పాలిటెక్నిక్ విద్యార్థులను స్కిల్ డెవలప్మెంట్ లో చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వీరంతా మెరిట్ స్టూడెంట్స్ అని పేర్కొన్నారు. విద్యార్థులు డీమోరల్ అవుతున్నారని ఎంపీ వాపోయారు. పోలీసులతో ఈ సమస్య పరిష్కారం చేద్దామని చూస్తే మాడి మసై పోతారని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కాంగ్రెస్ సర్కార్ కు. రామంతాపూర్ పాలిటెక్నిక్ కాలేజీకి పోదామంటే హౌస్ అరెస్ట్ చేశారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు . తాత జాగీరులాగా.. డుడు బసవన్నలా.. నిర్ణయాలు తీసుకుంటే మెడలు వంచి సరి చేయిస్తామని ఫైర్ అయ్యారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే కాలగర్భంలో కలిసి పోవడం ఖాయమన్నారు. జీవో నెంబర్ 97 రద్దు చేయకపోతే జరగబోయే పరిణామాలకు సీఎం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు ఈటల రాజేందర్.