విదేశాల్లో ఉన్నత విద్యకు విద్యార్థులకు సువర్ణావకాశం
హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తోంది. 2026 ఆగస్టు/సెప్టెంబర్ ఫాల్ సెషన్ కోసం దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 1 నుంచి 30 వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనుండగా, అందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్/పీహెచ్‌డీ వంటి ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తున్న లేదా అభ్యసించాలనుకుంటున్న అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది.
కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షల లోపు ఉండాలని, దరఖాస్తు చేసే నాటికి వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదని తెలిపింది. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని, అంతే కాకుండా GRE-260 లేదా GMAT-500 స్కోర్ కలిగి ఉండాలని పేర్కొంది. అంతే కాకుండా TOEFL-60 మార్కులు లేదా IELTS-6.0 లేదా PTE-50 మార్కులు స్కోర్ ఏదైనా కలిగి ఉండాలని స్పష్టం చేసింది. అర్హత కలిగిన విద్యార్థులు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలు, దరఖాస్తు ప్రక్రియ కోసం తెలంగాణ ఈ-పాస్ వెబ్‌సైట్ ను సందర్శించాలని సూచించింది.