రేపే తమ్మిడికుంట ప్రారంభోత్సవం

హైదరాబాద్: హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట సరస్సును హైడ్రా (HYDRA) సంస్థ పునరుద్ధరించింది. దీని ప్రారంభోత్సవ ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ పరిశీలించారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఈ సరస్సును ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. ప్రారంభోత్సవ వేదిక, అతిథులు , ప్రజల కోసం కేటాయించిన కూర్చునే ప్రాంతాలు, వాహనాల పార్కింగ్, అలాగే రాకపోకలకు సంబంధించిన ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను ఆయన తనిఖీ చేశారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్శనలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, డీసీపీ రితిరాజ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారు భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ ప్రజల రాకపోకల గురించి సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఈ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని నిర్ణయించారు. సరస్సు అభివృద్ధి పనులను పర్యవేక్షించిన ‘విమోజ్ టెక్నోక్రాట్స్’ (VIMOZ Technocrats) సంస్థ అధినేత యూనస్ పర్వేజ్ తమ్మిడికుంట చెరువుకు సంబంధించి చేపట్టిన మెరుగుదల పనులు , కల్పించిన సౌకర్యాల గురించి అధికారులకు వివరించారు.