వీసీ జానయ్యపై విచారణకు గవర్నర్ ఆదేశం

హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉప కులపతి (వైస్ ఛాన్సలర్ ) అల్టాస్ జానయ్య పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఇదే యూనివర్శిటీలో పని చేస్తున్న మహిళా ప్రొఫెసర్ తో అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం కలకలం రేపింది. ఇందుకు సంబంధించి సదరు బాధితురాలు బయటకు వచ్చింది. మీడియా ముందు వీసీ తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై ఆమె ఆవేదన చెందింది. ఆపై కన్నీటి పర్యంతమైంది. తీవ్ర భావోద్వేగానికి లోనై ఏకంగా తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. వీసీపై ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో వీసీ జానయ్యకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తుండడం వల్లనే చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో అన్ని యూనివర్శిటీలకు అధిపతిగా ఉన్న గవర్నర్ దృష్టికి ఈ వీసీ వ్యవహారం చేరింది.
దీంతో గత్యంతరం లేక గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వివాదాస్పద వైస్-ఛాన్సలర్ అల్దాస్ జనయ్యపై విచారణకు ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ కె. లక్ష్మి అధ్యక్షతన ఐఏఎస్ అధికారులు గోపి, రాహుల్ రాజ్, ప్రజ్జ్వల్ , ఎన్జీవో ప్రతినిధి సునీత కృష్ణన్లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది అల్దాస్ జనయ్యకు సంబంధించిన లైంగిక వేధింపుల కేసులో 15 రోజుల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని, ఆ మహిళా ప్రొఫెసర్ భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండగా తాను డీజీపీకి ఫిర్యాదు చేసిన 15 రోజుల తర్వాత కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయక పోవడంతో, ప్రభుత్వ అధికారులు నిందితుడిని రక్షిస్తున్నారని బాధితురాలు ఆరోపిస్తున్నారు.