newsseals.com

చెరువు అభివృద్ది కోసం నాగార్జున 2 ఎక‌రాల విరాళం

November 12, 2026 · VijayaBhaskar

హైదరాబాద్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల శిల్పారామం ఎదురుగా ఉన్న తమ్మిడికుంట చెరువును తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ చెరువును ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (HYDRAA – హైడ్రా) అభివృద్ధి చేసింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చెరువు అభివృద్ధికి తన వంతు సహకారం అందించినందుకు తెలుగు నటుడు అక్కినేని నాగార్జునను ముఖ్యమంత్రి అభినందించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ ద్వారా చెరువు విస్తీర్ణం 14 ఎకరాల నుండి 30 ఎకరాలకు పెరిగిందని, ఇందులో నాగార్జున స్వచ్ఛందంగా రెండు ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారని తెలిపారు.

సమాజానికి తిరిగి ఏదో ఒకటి ఇవ్వాలనే ఉద్దేశంతోనే నాగార్జున ముందుకు వచ్చారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆయనను ‘నిజ జీవిత హీరో’గా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. నాగార్జున చేసిన ఈ పని సినీ రంగానికి అతీతంగా ఆయనకున్న సామాజిక బాధ్యతను తెలియ జేస్తుందని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ,ఈ చెరువు విషయమై ‘హైడ్రా’ కమిషనర్ ఎ.వి. రంగనాథ్‌తో తన మొదటి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. తాను మొదట కొన్ని ఆలోచనలతో కమిషనర్‌ను కలిశానని, అయితే రంగనాథ్ పరిస్థితిని వివరంగా వివరించి, ఈ ప్రాజెక్ట్ ప్రాముఖ్యతను తనకు అర్థమయ్యేలా చెప్పారని అన్నారు. దీంతో తాను మ‌న‌సు మార్చుకున్నాన‌ని చెప్పారు. నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందించడమే సరైన నిర్ణయమని అప్పుడు తాను భావించానని ఆయన అన్నారు.

మనలో ఎవరూ ఇక్కడ శాశ్వతం కాదు. ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోవాల్సిందే అని తన నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశాన్ని ఆయన వివరించారు. చెరువును ఒక అందమైన ప్రజా ప్రదేశంగా తీర్చిదిద్దినందుకు రంగనాథ్‌ను అభినందించారు నాగార్జున, చెరువులు , నదుల పునరుద్ధరణ పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్న నిబద్ధతను ప్రశంసించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జల వనరులను పునరుద్ధరించడంలో ముఖ్యమంత్రికి ఎంతో ఆసక్తి, దృఢ సంకల్పం ఉన్నాయని నాగార్జున పేర్కొన్నారు.

Related News