newsseals.com
News

విశాఖ సీఐఐ సమ్మిట్ -2026 సూపర్ హిట్

Posted by: VijayaBhaskar November 14, 2026
newsseals-CIISummit2026

అమ‌రావ‌తి : విశాఖపట్నం వేదికగా గత రెండు రోజులుగా పండగ వాతావరణంలో జరిగిన సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు అద్భుతమైన విజయం సాధించిందని, ఇది రాష్ట్ర అభివృద్ధిలో ఒక గొప్ప శుభపరిణామమని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. శ‌నివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఐదేళ్ల పాలనలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన అనుభవంతో, దూరదృష్టితో చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయని ఎంపీ అన్నారు. ముఖ్యమంత్రి విజనరీ ఆలోచనలకు, మంత్రి నారా లోకేష్ గారి చురుకైన కార్యాచరణ తోడవడంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు తరలివచ్చి, రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చారని తెలిపారు. లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి రావడం ఎంతో సంతోషకరమన్నారు. సాధారణంగా పెట్టుబడిదారుల సదస్సులంటే కేవలం కంపెనీల రాక, వ్యాపార ఒప్పందాలకే పరిమితమవుతాయని, కానీ ఈ సదస్సు ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు నింపేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘పి4’ విధానాన్ని ప్రోత్సహించడం చారిత్రాత్మకమని కలిశెట్టి కొనియాడారు.

ఆర్థికంగా స్థిరపడిన వారితో పాటు పేదలను కూడా అభివృద్ధిలో భాగస్వాములను చేస్తూ, వారికి అండగా నిలిచేలా ఒప్పందాలు కుదుర్చుకోవడం దేశంలో మరే ముఖ్యమంత్రి చేయని సాహసోపేతమైన ఆలోచన అని ఆయన ప్రశంసించారు. పేదల సేవలో నిరంతరం ఉంటామన్న మాటను నిలబెట్టుకుంటూ సీఎం తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు. గతంలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేట్ వే లాంటి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు నాయుడు , నేడు అదే ఉత్తరాంధ్రలోని విశాఖలో ఇంతటి ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహించి ప్రాంతీయ అభివృద్ధికి మరింత బలం చేకూర్చారని ఎంపీ పేర్కొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఒక ఆంధ్రుడిగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (CSR) నిధులను పేదల సంక్షేమానికి అనుసంధానం చేయాలన్న సీఎం ఆలోచన ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనమని ఎంపీ అన్నారు.