newsseals.com
News

ఎంబీబీఎస్ చదువుకు మంత్రి కోమటిరెడ్డి అండ

Posted by: VijayaBhaskar November 18, 2026
newsseals-Komatireddy

న‌ల్ల‌గొండ జిల్లా : ఆపద‌లో ఉన్నామంటే చాలు ఆదుకునే గొప్ప మ‌న‌సు సోద‌రులైన మంత్రి, ఎమ్మెల్యే కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిలు. త‌మ పేర్ల‌తో సంస్థ‌ల‌ను ఏర్పాటు చేసి పేద‌ల‌ను ఆదుకుంటున్నారు. చ‌దువు కోసం ఇబ్బంది ప‌డుతున్న విద్యార్థుల‌కు అండ‌గా నిలుస్తున్నారు. దానాలు చేయ‌డం, సహాయ ప‌డ‌టం వీరి నైజం. తాజాగా ఓ పేద విద్యార్థిని చ‌దువుకునేందుకు తాను ఉన్నానంటూ భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి. పేదరికం చదువుకు అడ్డు కాకూడదని అన్నారు. నిరుపేద విద్యార్థిని ఎంబీబీఎస్ చదువుకు తాను స‌హ‌క‌రిస్తాన‌ని హామీ ఇచ్చారు.

నల్లగొండ జిల్లా మోత్కూరు మండలానికి చెందిన ఏ. రజిని అనే విద్యార్థిని ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఆమె తండ్రి మేస్త్రి పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా తదుపరి చదువు ముందుకు సాగని పరిస్థితుల్లో ఉన్న రజిని రాష్ట్ర మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి తన కుటుంబ పరిస్థితిని వివరించారు. ఆమె పరిస్థితిని విన్న మంత్రి వెంటనే స్పందించారు. ఉన్నత చదువులకు పేదరికం ఎప్పటికీ అడ్డుకాకూడదని స్పష్టం చేశారు. రజిని ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి అవసరమయ్యే మిగతా మూడేళ్ల ఫీజును ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా పూర్తిగా చెల్లిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు.

గత దశాబ్ద కాలంగా ఎంతో మంది పేద విద్యార్థులకు అండగా నిలిచి, వారిని డాక్టర్లుగా తీర్చిదిద్దుతున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సేవా దృక్పథం ఎందరికో ఆదర్శనీయం. నిరుపేద విద్యార్థుల భవిష్యత్తు పట్ల ఆయన చూపుతున్న దార్శనికత నిజంగా అభినందనీయం.